గూగుల్ జాబ్ రాలేదని ఫ్లిప్ కార్ట్ ప్రారంభించాడు

గూగుల్ జాబ్ రాలేదని ఫ్లిప్ కార్ట్ ప్రారంభించాడు

దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఎలా మొదలైందో తెలుసా? ఆ కంపెనీ సీఈవో బిన్నీ బన్సల్ కి గూగుల్ లో ఉద్యోగం రాకపోవడంతో ఫ్లిప్ కార్ట్ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. 2005లో ఐఐటీ-ఢిల్లీ నుంచి పట్టభద్రుడైన బిన్నీ బెంగుళూరులోని సార్నాఫ్ కార్పొరేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగంలో పనిచేశాడు. కానీ సాంకేతికతను కొత్త పుంతలు తొక్కిస్తున్న గూగుల్ లో ఉద్యోగం చేయాలని ఉవ్విళ్లూరి రెండుసార్లు దరఖాస్తు కూడా చేశాడు. కానీ గూగుల్ నుంచి పిలుపు రాలేదు. చేస్తున్న ఉద్యోగం విసుగనిపించి రాజీనామా చేసి తన ఐఐటీ సహచరుడు సచిన్ బన్సల్ సిఫార్సుతో అమెజాన్ లో చేరాడు. ఏడెనిమిది నెలలకే ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి ఫ్లిప్ కార్ట్ ప్రారంభించాడు. ఫ్లిప్ కార్ట్ ప్రారంభించడానికి దారితీసిన కారణాలను స్వయంగా బిన్నీ బన్సల్ చెప్పారు.

సచిన్ బన్సల్ తనను అమెజాన్ లోకి రిఫర్ చేశాడని బిన్నీ చెప్పాడు. సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా తనను రెఫర్ చేయడం ద్వారా సచిన్ భారీ బోనస్ అందుకున్నాడని వెల్లడించారు. అయితే 8 నెలల తర్వాత అమెజాన్ లో తాను ఉద్యోగం మానేయడంతో సచిన్ తను తీసుకున్న బోనస్ మొత్తాన్ని తిరిగి కంపెనీకి చెల్లించాల్సి వచ్చిందన్నాడు. అమెజాన్ నుంచి బయటికి వచ్చాక సొంతంగా ఏదైనా చేయాలనుకొన్నారు ఈ ఇద్దరు మిత్రులు. ఈకామర్స్ సైట్లని పోల్చి చూసే సైట్ రూపొందిద్దామని మొదట తను, సచిన్ బన్సల్ అనుకొన్నామని.. కానీ అప్పుడున్న సైట్లు గొప్పగా లేకపోవడంతో తామే ఈకామర్స్ సైట్ రూపకల్పన చేశామని బిన్నీ వివరించాడు. 11 ఏళ్ల క్రితం బెంగుళూరు కోరమంగళ ప్రాంతంలోని ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఫ్లిప్ కార్ట్ మొదలైందని.. ఇప్పుడది 8.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి విస్తరించిందని తెలిపాడు. 

ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఏర్పాటు చేసిన తను తన భార్యతో బిగ్ బాస్కెట్ యాప్ నుంచి కాకుండా ఫ్లిప్ కార్ట్ నుంచి కూరగాయలు కొనేలా ఒప్పించలేకపోతున్నానని బిన్నీ వ్యాఖ్యానించాడు. ఇప్పటికీ తాము డోర్‌ టూ డోర్ డెలివరీ చేయడంతో పాటు కస్టమర్లతో మాట్లాడుతుంటామని బిన్నీ చెప్పాడు. కొందరు తామెవరో తెలియక మామూలుగా మాట్లాడుతారని మరికొందరు గుర్తుపట్టి తమతో ఫోటో తీసుకుంటారని చెప్పిన బిన్నీ.. వీటిలో ఓ సరదా సంఘటన గుర్తు చేసుకున్నాడు. ఒకసారి ఓ కస్టమర్ ఇంటికి వెళ్తే.. తనను గుర్తుపట్టిన కస్టమర్ సెల్ఫీతో సరిపెట్టకుండా టీ, మిఠాయిలతో పొట్ట నింపేశాడని.. కస్టమర్ రాజులాంటి వాడు కనుక ఏం పెట్టినా కాదనకుండా తిన్నానని బిన్నీ సరదాగా వ్యాఖ్యానించాడు.

ఇటీవలే ఫ్లిప్‌కార్టును వాల్‌మార్ట్ టేకోవర్ చేసింది. 16 బిలియన్ డాలర్ల విలువైన ఆ డీల్‌కు సీసీఐ ఆమోదముద్ర కూడా వేసింది. టేకోవర్ తర్వాత కూడా బిన్నీ బన్సల్ సీఈవోగా కొనసాగుతారు. కొంత వాటాను కొనసాగిస్తున్నారు. అయితే ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ మాత్రం సంస్థ నుంచి బయటికి వెళ్లిపోయారు.