నాకు చికెన్ పెట్టడం లేదు

నాకు చికెన్ పెట్టడం లేదు

ముంబై పేలుళ్ల కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న డీ గ్యాంగ్ సభ్యుడు అబూ సలెం జైల్లో తనకు చికెన్ పెట్టడం లేదని ఫిర్యాదు చేశాడు. నవీ ముంబైలోని తలోజా జైలు అధికారులు తనను బలవంతంగా పూర్తి శాకాహారిగా మారుస్తున్నారని సలెం ఆరోపించాడు. అప్పగింత ఒప్పందాన్ని అధికారులు ఉల్లంఘిస్తున్నారని.. జైలులో తనకు ప్రాణహాని ఉందని అబూ సలెం పదేపదే ఫిర్యాదు చేస్తుండడంతో ఢిల్లీలోని పోర్చుగీస్ దౌత్య కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు అతనిని కలవడానికి వచ్చారు. వారి ముందు అబూ తన బాధలు ఏకరువు పెట్టాడు.

పోర్చుగల్ తో ఉన్న అప్పగింత ఒప్పందాన్ని జైలు అధికారులు ఉల్లంఘిస్తున్నట్టు అబూ సలెం చెప్పాడు. తనకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని, బలవంతంగా శాకాహారం తినాల్సి వస్తోందని సలెం తెలిపాడు. తను ఉన్న గదిలో తగినంత సూర్యరశ్మి లేదని.. 20 మంది కరడుగట్టిన నేరస్థులతో కలిసి ఉండాల్సి వస్తోందని ఫిర్యాదు చేశాడు. టాయిలెట్‌, బాత్రూమ్ చాలా చిన్నవిగా, అపరిశుభ్రంగా ఉన్నందువల్ల తాను తరచూ అనారోగ్యానికి గురవుతున్నానని.. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని అబూ సలెం చెప్పాడు. మాట్లాడేందుకు ఎవరూ లేకపోవడంతో రోజంతా న్యూస్ పేపర్ చదవి విసుగొస్తోందని తెలిపాడు.

 

తనను ఉత్తరప్రదేశ్ లోని ఏదైనా జైలుకి తరలించే ఏర్పాటు చేయాల్సిందిగా సలెం పోర్చుగీసు అధికారులను కోరాడు. అక్కడైతే ఆజంగఢ్ లో ఉండే తన సోదరి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి కలుసుకొనడానికి వీలుగా ఉంటుందని చెప్పాడు. ముంబైకి రావడం దూరాభారంతో కూడినది కావడంతో వారు తరచుగా వచ్చి పలకరించడం లేదని తెలిపాడు.

తలోజా జైలుకి వచ్చిన పోర్చుగీస్ అధికారులు

తనకు ప్రాణహాని ఉందని, జైల్లో అసౌకర్యాలపై అబూ సలెం ఫిర్యాదు అందుకున్న పోర్చుగీస్‌ దౌత్యాధికారులు తలోజా జైలుకి వచ్చారు. తమతో తీసుకొచ్చిన వైద్యులతో సలెంకి పరీక్షలు జరిపించారు. ఆ తర్వాత జైలు సిబ్బందితో సమావేశమయ్యారు. సలెంని ఉంచిన జైలు గదిని చూడాలనుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరని చెప్పిన అధికారులు అందుకు నిరాకరించారు.