బావర్చి హోటల్‌పై అధికారుల కొరడా..!

బావర్చి హోటల్‌పై అధికారుల కొరడా..!

హైదరాబాద్‌ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది బిర్యానీ... ఇక 'బావర్చి' బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది. జంట నగరాల్లో బావర్చి ముందు ఓ పేరు జోడించి ఎన్ని హోటళ్లు పెట్టినా... ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని 'బావర్చి' హోటలల్‌కు మంచి గుర్తింపు ఉంది. అయితే, జీహెచ్‌ఎంసీ అధికారులు బావర్చి హోటల్‌ను సీజ్ చేయడంతో మధ్యాహ్నం బిర్యానీ ప్రియులు అల్లాడిపోయారు... ఇంతకీ బావర్చి హోటల్‌ను ఎందుకు సీజ్ చేశారనే వివరాల్లోకి వెళ్తే... ఈ హోటల్‌ నిర్వాహకులు వ్యర్థ పదార్థాల నిర్వహణ చేపట్టడంలేదని.. హోటల్‌లో తడి, పొడి చెత్తను వేరుచేయడం లేదంటూ సీజ్‌ చేశారు. గత కొంత కాలంగా బావర్చి హోటల్‌ నిర్వాహకులకు తడి, పొడి చెత్తను వేరు చేయాలని, ఆర్గానిక్‌ వేస్ట్‌ కన్వర్టర్‌ యంత్రాన్ని పెట్టుకోవాలని ఆదేశించిన పట్టించుకోవడం లేదని... నోటీసులు ఇచ్చినా స్పందించకుండా వ్యర్థపదార్థాలను మ్యాన్‌ హోల్‌లోకి వదిలేస్తున్నారని... దీంతో హోటల్‌ను సీజ్ చేసినట్టు జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-15 అధికారులు తెలిపారు. ఇక అధికారులు హోటల్‌ను సీజ్ చేయడంతో ఉరుకులు పరుగుల మీద బావర్చి హోటల్ నిర్వాహకులు ఆర్గానిక్‌ వేస్ట్‌ కన్వర్టర్‌ యంత్రాన్ని వెంటనే తెప్పించి బిగించారు. దీంతో తిరిగి బావర్చి హోటల్‌ను తెరిచేందుకు అనుమతించారు జీహెచ్‌ఎంసీ అధికారులు.