పాండా ఎన్ క్లోజర్ లోకి బాలిక జారిపడితే.. వైరల్ వీడియో

పాండా ఎన్ క్లోజర్ లోకి బాలిక జారిపడితే.. వైరల్ వీడియో

చూసే వారి గుండెలు అదిరిపోయే సంఘటన ఒకటి చైనాలో జరిగింది. 8 ఏళ్ల బాలిక పాండా ఎన్ క్లోజర్ లోకి జారి పడిపోయింది. చైనాలోని చెంగ్దూ రీసెర్చ్ బేస్ ఆఫ్ జెయింట్ పాండా బ్రీడింగ్ లో శనివారం ఈ ఘటన చోటు చేసుకొంది. పాప ఎన్ క్లోజర్ లోకి పడిన సమయంలో మూడు పాండాలు అక్కడే తిరుగుతున్నాయి. చైనా డైలీ వార్త ప్రకారం ఈ సంఘటన తర్వాత షిచువాన్ ప్రావిన్స్ లోని రీసెర్చ్ ఫెసిలిటీ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. 

'పాండాలు సున్నితంగా, స్నేహపూర్వకంగా ఉండవు. పాండాలకు రెండేళ్లు రాగానే వాటి సంరక్షకులు కూడా దూరం పెడతారు. దయచేసి వాటికి దూరంగా ఉండండి' అని హెచ్చరించింది. ఎన్ క్లోజర్ లో పాప రక్షించడం కష్టమైన ప్రదేశంలోకి జారి పడినట్టు ఈ వీడియోలో చూడవచ్చు. సెక్యూరిటీ గార్డ్ ఓ కర్రతో ఆ బాలికను బయటికి తీసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. వందలాదిగా జనం ఆ చుట్టుపక్కల చేరి ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. రెండు పాండాలు ఆ చిన్నారి వైపు రాబోయాయి. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు.

అదే సమయంలో మూడో పాండాకు అక్కడకు చేరుకొంది. దానిని చూసి సెక్యూరిటీ గార్డ్ కర్రతో రక్షించే ప్రయత్నం విరమించుకొని కొంచెం కిందకు వెళ్లి ఆ బాలిక చేతిని చేజిక్కించుకొని పైకి లాగాడు. లియూ గుయీహువా అనే గార్డ్ ఆ పాప ప్రాణాలను రక్షించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆ గార్డ్ సాహసాన్ని అంతా వేనోళ్ల పొగుడుతున్నారు. సంఘటన తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. పాపను ఆమె కుటుంబానికి అప్పజెప్పారు.