మూసీ సుందరీకరణకు గ్లోబల్‌ టచ్‌

మూసీ సుందరీకరణకు గ్లోబల్‌ టచ్‌

మూసీ నది సుందరీకరణకు అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 57.50 కిలో మీటర్ల నది పరీవాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు డిజైన్లు రూపొందించాలంటూ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు ఆహ్వానం పలికింది. ఈ డిజైన్లను నిపుణల కమిటీ పరిశీలించాక పనులు ప్రారంభమవుతాయి. ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఇప్పటికే పది కంపెనీలు తమ పేర్లు నమోదు చేసుకున్నాయి. డిజైన్లు సమర్పించే కంపెనీలు మే 9నాటికి తమ పేర్లు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. సుందరీకరణలో భాగంగా ముందుగా డిసెంబర్‌ 2018లో పురానాపూల్‌ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు 3 కిలోమీటర్ల మేర పనులు చేపడతారు. ఈ పనులకు జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, హెచ్‌ఎండీఏ సహకారం అందిస్తుంది.

గండిపేట (ఉస్మాన్‌సాగర్‌) నుంచి ప్రారంభమయ్యే మూసీ నది.. గౌరెల్లి వరకు సుమారు 57.50 కి.మీ మేర ప్రవహిస్తోంది. ఈ నదిపై  ఈస్ట్‌- వెస్ట్‌ కారిడార్‌ను నిర్మించి.. రెండున్నరేళ్లలో సుందరీకరణ పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు టరన్‌ స్కేప్‌(చైనా), ఈకో సిస్టమ్‌ డిజైన్‌(అమెరికా), హిన్నింగ్‌ లర్న్సన్‌(డెన్మార్క్‌), వావ్‌ డిజైన్‌ స్టూడియో(సింగపూర్‌), అరూప్‌ ఇంటర్నేషనల్‌(యూకే-ఇండియా), స్పేస్‌ మ్యాటర్స్‌ అండ్‌ స్నోహెట్టా (నార్వే-ఇండియా), సుర్బానా జరోంగ్‌ (సింగపూర్‌-ఇండియా), హెచ్‌సీపీ డిజైన్‌ (ఆహ్మదాబాద్‌) సంస్థలు ఆసక్తి కనబరుస్తూ పనులకు దరఖాస్తు చేసుకున్నాయి.