రేషన్ డీలర్లకు సంక్రాంతి కనుక...

రేషన్ డీలర్లకు సంక్రాంతి కనుక...

సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ డీలర్లకు శుభవార్త వినిపించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... రేషన్ డీలర్ల కోరిక మేరకు నిత్యావసర సరుకుల పంపిణీ కమీషన్‌ను సంక్రాంతి కానుకగా 75 పైసల నుంచి రూపాయికి పెంచుతున్నట్టు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 29 వేల మంది రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి ప్రత్తిపాటి... రేషన్ డీలర్ల కమిషన్‌ను రూపాయికి పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని... బియ్యం, పంచదార, రాగులు, జోన్నలు, కందిపప్పు కమిషన్‌ ఒక్క రూపాయి చేశామని... అన్ని నిత్యావసర సరుకుల పంపిణీ కమీషన్‌ను పెంచామన్నారు. 85 శాతం సంతృప్తి దాటిన డీలర్లకు ప్రతి నెల రూ. 2 వేలు ప్రోత్సాహకం ఇస్తామన్న పుల్లారావు... 25 పైసలు ఉన్న కమిషన్ టీడీపీ అధికారంలోకి వచ్చాక రూపాయికి చేశామని వెల్లడించారు. 

పెన్షన్లను పది రెట్లు పెంచి సీఎం చంద్రబాబు ప్రతీ ఇంట పెద్దకొడుకు అని నిరూపించుకున్నారని ప్రశంసించారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... చంద్రన్న నిర్ణయంతో సంక్రాంతికి ముందే పండుగ వాతావరణం నెలకొందన్న ఆయన... ఏపీలో ఇచ్చినట్లు దేశంలో, ఏ రాష్టంలో కూడా ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వడంలేదన్నారు. తెలంగాణలో కూడా ఐదు రకాల పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారని తెలిపిన మంత్రి... పేదల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.