రెండేళ్లుగా సోషల్ మీడియా ఖాతాలపై ప్రభుత్వ నిఘా

రెండేళ్లుగా సోషల్ మీడియా ఖాతాలపై ప్రభుత్వ నిఘా

సోషల్ మీడియాలో కాలం గడిపే వారికి పెద్ద షాకిచ్చే వార్త. కనీసం రెండేళ్లుగా దేశంలో పౌరుల సోషల్ మీడియా అకౌంట్లపై ప్రభుత్వం నిఘా పెట్టి ఉంచింది. సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేకంగా టెండర్లు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు వచ్చేంత వరకు నిఘా పెట్టినట్టు సమాచార హక్కు ద్వారా తెలిసిందని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ప్రజల డిజిటల్ కదలికలను కేంద్ర సమాచార మంత్రిత్వశాఖలోని ఓ సోషల్ మీడియా సమాచార హబ్ ద్వారా గమనిస్తూ వచ్చినట్టు బిజినెస్ స్టాండర్డ్ తన కథనంలో వివరించింది. 2019 సాధారణ ఎన్నికల వరకు ఈ నిఘాను కొనసాగించాలని భావించినట్టు తెలిసింది.

సమాచార హక్కు ద్వారా సంపాదించిన పత్రాలలో నివ్వెరపరిచే పలు విషయాలు వెలుగు చూశాయి. సమాచార మంత్రిత్వశాఖ సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థను రెండేళ్లకు కాంట్రాక్ట్ పై నియమించింది. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ కి చెందిన వెంకటేష్ నాయక్ అనే ఆర్టీఐ కార్యకర్త మేలో సాధించిన పత్రాలలో ఇది స్పష్టమైంది. మొదట ఈ వివరాలు ఇచ్చేందుకు నిరాకరించినా కోర్టులో కేసు వేయడంతో సమాచారం అందజేయక తప్పలేదు. 

దేశప్రజల సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టేందుకు పిలిచిన టెండర్లను ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఉపసంహరించుకొంది. ఇలాంటి చర్యలు భారతదేశాన్ని ‘నిఘా రాజ్యం‘గా మారుస్తాయన్న సుప్రీంకోర్ట్ అక్షింతలతో ప్రభుత్వం తన ఆలోచననను విరమించుకొంది. ఏప్రిల్ లో విడుదల చేసిన టెండర్ ప్రకటన ప్రకారం ప్రజల సోషల్ మీడియా పోస్టులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఓ సంస్థను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలనుకుంది. సోషల్ మీడియా పోస్టులతో పాటు ఈమెయిల్స్, వివిధ సామాజిక మాధ్యమాల్లో వారి గత సంభాషణలు, ప్రభుత్వ విధానాలపై వారి అభిప్రాయాలు క్రోడీకరించడం, ప్రభుత్వం పట్ల వారిలో సానుకూల దృక్పథాన్ని పెంచేలా మెసేజ్ లు పంపడం వంటివి ఆ సంస్థ బాధ్యతలు.