ముగిసిన తొలివిడత నామినేషన్లు.. ఏకగ్రీవాలు

ముగిసిన తొలివిడత నామినేషన్లు.. ఏకగ్రీవాలు

తెలంగాణ రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు బుధవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆఖరి గంట వరకు కూడా అభ్యర్థులు నామినేషన్లకు బారులు తీరారు. గురువారం నామినేషన్లు పరిశీలించి తప్పులుంటే అప్పీలుకు 11న అవకాశం ఇస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 13 వరకు అవకాశం ఉంది. తొలిదశ  పోలింగ్‌ ఈనెల 21న జరగనుంది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించారు. ఒకే పార్టీ నుండి నలుగురు పోటీపడడంతో వేలం నిర్వహించారు. ఓ వ్యక్తి రూ. 15 లక్షలు ఇవ్వటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని లక్ష్మాపూర్‌, కుమ్మరోనిపల్లి, వంగూరోనిపల్లి, కల్ములోనిపల్లి, ప్రశాంతినగర్‌ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. అయితే ఇక్కడ ఎస్టీ అభ్యర్థులు లేకపోవడంతో ఒక్క నామినేషను కూడా దాఖలు కాలేదు. మరి ఎవరికీ రిజర్వేషన్ ఇస్తారో చూడాలి.

బుధవారం జరిగిన నామినేషన్ల దాఖలులో పలు గ్రామాలు ఏకగ్రీవంగా సర్పంచ్ ను ఎన్నుకున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 542 పంచాయతీలకు గాను 17 గ్రామాలు ఏకగ్రీవంగా సర్పంచ్ ను  ఎన్నుకున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 28 పంచాయతీలు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 20 పంచాయతీలు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 45, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 15 పంచాయతీలు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 17, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 29, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 81 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.