జనవరిలో రూ.1.02 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

జనవరిలో రూ.1.02 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

ఈ ఏడాది మొదటి నెలలో రూ.1.02 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. ఇది గత ఏడాది ఏప్రిల్ తర్వాత ఏ నెలలోనైనా వసూలైన రెండో అతిపెద్ద మొత్తమని తెలిపింది. ఇంతకు ముందు డిసెంబర్ 2018లో జీఎస్టీ నుంచి రూ.94,725 కోట్లు వసూలయ్యాయి. ఇది జనవరి 2018లో వసూలైన రూ.89,825 కోట్లతో పోలిస్తే 14% అధికం.

డిసెంబర్ నుంచి జనవరి 31 2019 వరకు జీఎస్టీఆర్-3బీ కింద మొత్తం రూ.73.3 లక్షల రిటర్న్ లు దాఖలైనట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ చెప్పింది. జనవరి 2019లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1,02,503 కోట్లు కాగా ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.17,763 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.24,826 కోట్లు, ఏకీకృత జీఎస్టీ రూ.51,225 కోట్లు, ఇతర పన్నులు రూ.8,690గా ఉన్నాయని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో జీఎస్టీ వసూళ్ల మొత్తం రూ.లక్ష కోట్లు దాటడం ఇది మూడోసారి. ఇంతకు ముందు పోయినేడాది ఏప్రిల్, అక్టోబర్ లలో కూడా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 2018 ఏప్రిల్ లో రూ.1.03 లక్ష కోట్లు, మేలో రూ.94,016 కోట్లు, జూన్ లో రూ.95,610 కోట్లు, జూలైలో రూ.96,483 కోట్లు, ఆగస్ట్ లో రూ.93,960 కోట్లు, సెప్టెంబర్ లో రూ.94,442 కోట్లు, అక్టోబర్ లో రూ.1,00,710 కోట్లు, నవంబర్ లో రూ.97,637కోట్లు, డిసెంబర్ లో రూ.94,725 కోట్లుగా ఉన్నాయి.