పాక్‌లో హఫీజ్ సయీద్‌కు మరో ఎదురుదెబ్బ...

పాక్‌లో హఫీజ్ సయీద్‌కు మరో ఎదురుదెబ్బ...

ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లో అడుగుపెట్టాలని చూస్తున్న ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దావా చీఫ్ హఫీజ్ సయీద్‌కు మరోసారి ఎదురుదెబ్బతగిలింది... ఇప్పటికే హఫీజ్ సయీద్‌కు చెందిన మిల్లి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్)కు రాజకీయ హోదా ఇవ్వకూడదని అంతర్జాతీయ సంస్థలు పాకిస్థాన్‌కు సూచించగా... తాజాగా రాజకీయ పార్టీ హోదా కల్పించాలన్న దరఖాస్తును పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఎంఎంఎల్‌కు నిషేధిత జమాత్ ఉద్ దవాతో సంబంధాలు ఉన్నాయన్న హోం శాఖ అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది.

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయటానికి అల్ప-ఓ-అక్బర్ తెహ్రీక్ (ఏఏటీ) వేదికను వాడుకోవాలని హఫీజ్ సయీద్‌కు సంబంధాలున్న మిల్లి ముస్లిం లీగ్ నిర్ణయించింది. అయితే పాకిస్థాన్ ఎన్నికల కమిషన్... ముంబై దాడుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్‌కు చెందిన నిషేధిత జమాత్-ఉద్-దావాతో లింక్‌లున్న ఎంఎంఎల్ చేసుకున్న దరఖాస్తును రెండోసారి కూడా తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఎన్నికల కమిషన్‌లో నమోదు చేసుకున్న ఏఏటీ బ్యానర్‌పై జులై 25 జరిగే ఎన్నికల్లో సుమారు 200 మంది అభ్యర్థులు పోటీచేసేందుకు సిద్ధమయ్యారు... ఉధృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.