ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో హలెప్‌, స్టీఫెన్స్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో హలెప్‌, స్టీఫెన్స్‌

రుమేనియా స్టార్‌ సిమోనా హలెప్‌, అమెరికా స్టార్ స్లోన్‌ స్టీఫెన్స్‌ లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో అడుగుపెట్టారు. శనివారం జరిగే తుది పోరులో గ్రాండ్‌స్లామ్‌ కలను నెరవేర్చుకునేందుకు ఈ ఇద్దరు అమ్మాయిలు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా రొలాండ్‌గారోస్‌లో తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకుంటారు. ఫ్రెంచ్‌ సెమి ఫైనల్స్ లో అద్భుత ఆటతో మూడోసారి ఫైనల్‌కు దూసుకొచ్చింది హలెప్‌. 2017, 2014లో ఫైనల్‌కు చేరుకున్నా.. ట్రోఫీని మాత్రం నెగ్గలేకపోయింది. అయితే హలెప్‌ జోరుమీదుండడంతో ఈ సారి కప్పును సాధింస్తుందన్న నమ్మకం ఉంది.

గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్‌ ప్లేయర్‌, మాజీ ఛాంపియన్‌ గాబ్రిన్‌ ముగురుజను 6-1, 6-4తో వరుస సెట్లలో చిత్తుగా ఓడించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న హలెప్‌కు రెండో సెట్లో మాత్రం గట్టి పోటీ ఎదురైంది. మూడో గేమ్‌లో బ్రేక్‌ సాధించిన ముగురుజ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. హలెప్‌ ఎనిమిదో గేమ్‌లో 4-4తో సమం చేసింది. ఆ తర్వాత హలెప్‌ పదో గేమ్‌లో ముగురుజ సర్వీసును బ్రేక్‌ చేసి సెట్‌ను గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక మరో సెమీ ఫైనల్ మ్యాచ్ లో పదో సీడ్‌ అమెరికా స్టార్ స్లోన్‌ స్టీఫెన్స్‌ 6-4, 6-4తో తమ దేశానికే చెందిన మాడిసన్‌  కీస్‌ను ఓడించింది.