పాండ్యా, రాహుల్ లపై సస్పెన్షన్ వేటు

పాండ్యా, రాహుల్ లపై సస్పెన్షన్ వేటు

ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ ఆడటం అనుమానంగానే ఉంది. రేపు జరిగే వన్డే మ్యాచ్ లో పాండ్యా, రాహుల్ ఆడకుండా సస్పెన్షన్ విధిస్తున్నట్టు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ ప్రకటించారు. కాఫీ విత్ కరణ్ షోలో ఈ ఆటగాళ్లిద్దరూ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై దర్యాప్తు పెండింగ్ లో ఉన్నందువల్ల వారిని సస్పెండ్ చేస్తున్నట్టు రాయ్ తెలిపారు. శనివారం ప్రారంభమయ్యే  వన్డే సిరీస్ లో ఆడేందుకు హార్దిక్, రాహుల్ ఆస్ట్రేలియాలో ఉన్నారు. సిడ్నీలో జరిగే ప్రారంభ మ్యాచ్ లైనప్ నుంచి వీళ్లిద్దరినీ ఇప్పటికే తొలగించారు.

‘దర్యాప్తు పెండింగ్ లో ఉన్నందువల్ల పాండ్యా, రాహుల్ ఇద్దరినీ సస్పెండ్ చేస్తున్నామని’ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. ఈ  వ్యవహారంలో హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ ని అధికారికంగా విచారించనున్నట్టు తెలిసింది. అధికారిక విచారణ ప్రారంభానికి ముందు మరోసారి ఆటగాళ్లిద్దరికీ తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ‘ఆటగాళ్లను బీసీసీఐ అంతర్గత కమిటీ విచారిస్తుందా లేదా తాత్కాలికంగా నియమించే ఆంబుడ్స్ మన్ విచారణ చేపడతారా అనేది ఇంకా నిర్ణయించలేదు. వాళ్లని అక్కడే ఉంచుకోవాలా లేక స్వదేశానికి పంపాలా అనేది టీం మేనేజ్ మెంట్ నిర్ణయిస్తుంది. దేశంలో వాళ్లపై విమర్శల వెల్లువ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందువల్ల అక్కడే ఉంచుకోవచ్చనేది ఒక ఆలోచన. కానీ బీసీసీఐలో ఎక్కువ మంది మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారని’ బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

పాండ్యా, రాహుల్ ల వ్యాఖ్యలు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కిందనికి రావని బీసీసీఐ న్యాయ బృందం తెలిపింది. దీంతో సీఓఏ సభ్యురాలు డయాలా ఎడుల్జీ శుక్రవారం ఇద్దరిపై చర్యలు తీసుకొనే వరకు సస్పెండ్ చేయాలని సిఫార్సు చేశారు. మొదట రెండు మ్యాచ్ ల సస్పెన్షన్ తో సరిపెట్టాలన్న ఎడుల్జీ, తర్వాత ఈ వ్యవహారాన్ని లీగల్ సెల్ కి పంపారు. అప్పుడు వినోద్ రాయ్ కూడా ఆమెతో ఏకీభవించి అదే శిక్షను సిఫార్సు చేశారు.