హైదరాబాద్ లో గాలి దుమారం, భారీ వర్షం

హైదరాబాద్ లో గాలి దుమారం, భారీ వర్షం
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండతో, ఉక్కపోతతో అల్లాడించిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం దట్టంగా మేఘాలతో కమ్మేసింది. నిమిషాల్లోనే మారిపోయిన వెదర్.. గాలి దుమారంతో బెంబేలెత్తించింది. ఆ వెంటనే భారీ వర్షం. ఊహించని విధంగా వాతావరణంలో మార్పులతో ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. 
 
నాచారం, మల్లాపూర్, సికింద్రాబాద్, బేగంటపేట, పంజాగుట్ట, అమీర్ పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, కోఠి, బర్కత్ పుర, నారాయణగూడ, ఉప్పల్, రామాంతాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.  ఊహించని విధంగా ఒక్కసారిగా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. 
 
చార్మినార్, దిల్ ఖుష్ నగర్, ఎల్బీనగర్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి దుమారానికి చాలా చోట్ల హోర్డింగ్స్ ఎగిరిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపోవటంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. లోతట్టు ప్రాంతాలోకి నీరు చేరడంతో.. అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  
 
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంతో పాటు రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్, హైదర్ గూడ, ఉప్పర్ పల్లి, బుద్వేల్, రాజేంద్రనగర్, శివరాంపల్లి, కాటేదాన్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగింది. అకస్మాత్తుగా వచ్చిన గాలివానతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.  ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో.. చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి.  కూలిన చెట్లను తొలగించాల్సిందిగా అర్బన్ బయోడైవర్సిటీ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు.