విజయవాడలో హై టెన్షన్ 

విజయవాడలో హై టెన్షన్ 

విజయవాడలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.  బెంజ్ సర్కిల్లోని  జైఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని అధికారులు తొలగిస్తుండగా  వైకాపా నేతలు అడ్డుకోవడంతో టెన్షన్‌ నెలకొంది.  రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ పనులలో భాగంగా  అర్థరాత్రి అధికారులు కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించారు. తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా.. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన  వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించడాన్ని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత యలమంచిలి రవి అడ్డుకున్నారు. సమాచారం కూడా లేకుండా అర్ధరాత్రి సమయంలో  అధికారుల చేత ప్రభుత్వమే విగ్రహాన్ని తొలగించిందని ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. అర్థరాత్రి దొంగచాటుగా క్రేన్ల సహాయంతో విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కుయుక్తులు పన్నడం టీడీపీ ప్రభుత్వం నైజంగా ఆయన ఆరోపించారు.

అధికారులకు, యలమంచిలి రవి మధ్య వాగ్వాదం పెరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. లోగా రవి అభిమానులు అక్కడికి చేరుకున్నారు. తోపులాట జరగడంతో  ముందు జాగ్రత్తగా  బెంజి సర్కిల్ లో పోలీసులు భారీగా మోహరించారు. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, పగలు విగ్రహాన్ని తొలగిస్తే ప్రజలకు ఇబ్బంది కల్గుతుందనే రాత్రి పూట విగ్రహాన్ని తొలగిస్తున్నామంటూ రవిని అధికారులు  సముదాయించే ప్రయత్నించే చేశారు. అయినా ఆయన వాగ్వాదానికి దిగడంతో  రవిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత  కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని అధికారులు తొలగించారు. దీనికి దాదాపు మూడు గంటలు పట్టింది.