పెద్ద డిగ్రీలు ఉంటే... ప్ర‌యారిటీ ఇవ్వాల్సిన ప‌నిలేదు

పెద్ద డిగ్రీలు ఉంటే... ప్ర‌యారిటీ ఇవ్వాల్సిన ప‌నిలేదు

ఒక అభ్యర్థికి ఉన్నత అర్హతలు ఉన్నంత మాత్రాన తక్కువ అర్హత అవసరమైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే హక్కు లేదని సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది. తక్కువ అర్హతను సాధించినట్టుగా ఉన్నత అర్హతను సంబంధిత చట్టపరమైన నియామక నియమాలు అనుమతిస్తేనే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. జమ్ముకశ్మీర్ లోని విద్యుత్ శాఖలో టెక్నిషియన్-III ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కేసును జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ ల ధర్మాసనం విచారణ జరిపింది. ఆ పోస్టుకు కనీస అర్హతగా ‘మెట్రిక్, ఐటిఐ‘గా పేర్కొన్నారు. ఐటిఐ ధృవీకరణ పత్రం లేకపోయినా కొందరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకొన్నారు. ప్రాథమికంగా వారి దరఖాస్తులను అంగీకరించారు. రాత పరీక్ష తర్వాత వారు మౌఖిక పరీక్షకు కూడా ఎంపికయ్యారు. అప్పుడు మేల్కొన్న సర్వీస్ సెలక్షన్ బోర్డు వారికి తాము పేర్కొన్న అర్హతలు లేవంటూ వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని నిర్ణయించింది.

బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్ముకశ్మీర్ హైకోర్ట్ లో కేసులు వేశారు. డిప్లమా ఉన్నత అర్హత కనుక అంత కంటే తక్కువైన ఐటిఐ పత్రాలు ఉన్నాయని భావించాలని చెబుతూ అభ్యర్థులను తొలగించాలన్న బోర్డు నిర్ణయాన్ని సింగిల్ బెంచ్ కొట్టేసింది. వారిని సెలక్షన్ లిస్ట్ లో చేర్చాలని సూచించింది. బోర్డు నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ సమర్థించింది. దీనిని సవాల్ చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్ట్ మెట్లెక్కారు. వారు జ్యోతి కెకె వర్సెస్ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుని ఉటంకించారు. కేఎస్ఈబీ సబ్ ఇంజనీర్ల కోసం వేసిన ప్రకటనలో డిప్లమాను విద్యార్హతగా పేర్కొంది. కానీ జ్యోతికి బీటెక్ ఉన్నందువల్ల అంతకంటే తక్కువైన డిప్లమా సాధించినట్టే భావించాలని కోర్టు చెప్పింది.

అయితే బెంచ్ జ్యోతి కేసుకి, ఈ కేసుకి ఉన్న తేడాను వివరించింది. జ్యోతి కేసులో కేరళ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఉన్నత అర్హతలు ఉంటే తక్కువ అర్హత సాధించినట్టేనని భావిస్తారు. కానీ ప్రస్తుత కేసులో అలాంటి చట్టపరమైన నియమాలు లేనందువల్ల వారి కేసు చెల్లదని స్పష్టం చేసింది.