హోమ్, ఆటో లోన్స్ ఇక చౌక

హోమ్, ఆటో లోన్స్ ఇక చౌక

ఆర్బీఐ తన ఆరో ద్రవ్య సమీక్షా విధానాన్ని ప్రకటించింది. ఆర్బీఐ రెపో రేటుని 6.5% నుంచి 6.25%కి తగ్గించింది. రివర్స్ రిపో రేటుని కూడా తగ్గించి 6% చేసింది. రెపో రేటు తగ్గింపుతో సామాన్య మానవులకు భారీ ఊరట దక్కనుంది. హోమ్ లోన్లు, ఆటోమొబైల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో రెపో రేటుని 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ 6.25%గా నిర్ణయించారు. దీంతో పాటు కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యపరమైన వైఖరిని కఠినం నుంచి సరళంగా/తటస్థంగా మార్చుకొంది.

ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ)లోని ఆరుగురు సభ్యులలో నలుగురు రేట్లలో కోత పెట్టడాన్ని సమర్థించారు. పాలసీ వైఖరిలో మార్పునకు అందరూ సభ్యులు ఆమోదం తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 7.4%గా ఉండనుందని ఆర్బీఐ అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్లలో ద్రవ్యోల్బణం 3.2-3.4% మధ్య ఉండవచ్చని తెలపింది. మూడో త్రైమాసికంలో 3.9% కావచ్చు.

ద్రవ్యోల్బణ లక్ష్యం 4% (+- 2%)గా ఆర్బీఐ నిర్దేశించింది. ఇంధన ధరల పతనం కారణంగా దేశ రిటైల్ ద్రవ్యోల్బణ రేటు తగ్గి డిసెంబర్ లో 2.19% అయింది. నవంబర్ లో ఇది 2.33%. గత కొన్ని నెలల్లో ద్రవ్యోల్బణ రేటు ఆర్బీఐ నిర్ణయించిన లక్ష్యం కంటే చాలా కింద ఉంటోంది. రీటైల్ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంది. వడ్డీ రేట్లలో తగ్గింపు తర్వాత బ్యాంక్ లు కూడా వడ్డీలు తగ్గించవచ్చు. దీంతో హోమ్ లోన్స్, ఆటోమొబైల్ రుణాలు తీసుకున్నవారు ఈఎంఐ మొత్తాలు తక్కువగా చెల్లించాల్సి వస్తుంది.