అగ‌స్తా కుంభ‌కోణంః ఆడ‌పిల్ల‌ను అడ్డు పెట్టి తెచ్చారా?

అగ‌స్తా కుంభ‌కోణంః ఆడ‌పిల్ల‌ను అడ్డు పెట్టి తెచ్చారా?

యుపిఏ హయాంలో జరిగిన ఆగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన యూరప్ మధ్యవర్తి, క్రిస్టియన్ జేమ్స్ మైకెల్ ను మంగళవారం రాత్రి భారత్ కు తీసుకొచ్చారు. దుబాయ్ కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆయనను యుఏఈ నుంచి భారత్ కు అప్పగించారు. ‘పారిపోయిన దుబాయ్ యువరాణి ప్రిన్సెస్ లతీఫాను వెతికి పట్టుకోవడంలో భారత్ సహాయానికి దీనికి లింక్ ఉన్నట్టు‘ భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి.

పారిపోయిన యువరాణి: 
దుబాయ్ పరిపాలకుడు, యుఏఈ ప్రధానమంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ కూతురైన షేకా లతీఫా ఈ ఏడాది ఆరంభంలో (7 ఏళ్లపాటు పారిపోయేందుకు ప్రణాళికలు వేసి) దుబాయ్ నుంచి పారిపోయింది. ఆమె గోవాకి వెళ్తున్న ఫ్రెంచ్-అమెరికన్ హెర్వ్ జాబర్ట్ కి చెందిన పడవ ఎక్కేసింది. తీరానికి 30 మైళ్ల దూరంలో ఉండగా పడవని అడ్డుకొని (ఇండియన్ కోస్ట్ గార్డులని ఆరోపణ) ఆమెను బలవంతంగా ఇంటికి చేర్చారు. ఆ తర్వాత ఆమె గురించి ఎక్కడా ఏ సమాచారం లేదు. ఆమె పారిపోయే ముందు విడుదల చేసిన ఓ వీడియోలో ‘ఇది మీరు చూస్తుంటే, నేను చనిపోయైనా ఉండాలి లేదా చాలా దుర్భర పరిస్థితిలో అయినా ఉండాలి‘ అని చెప్పింది.

ఆమె అదృశ్యం కావడానికి ‘యుఏఈ, భారత్‘ కారణమని ఆరోపించిన ఆమె తరఫు లాయర్లు, ఆమె సురక్షితంగా విడుదలయ్యేందుకు జోక్యం చేసుకోవాల్సిందిగా ఐక్యరాజ్య సమితిని కోరారు. ఆమ్నెస్టీ భారత కమెండోల తీరుని తీవ్రంగా దుయ్యబట్టింది. ‘ భారత కమాండోలు పడవపై ఉన్నవారందరినీ తుపాకులతో బెదిరించి, షేకాను ఈడ్చుకుపోయారు. తనకు రాజకీయ ఆశ్రయం కావాలని అరుస్తున్నా లాక్కుపోయారని‘ చెప్పింది.

యువరాణిని ఇంటికి చేర్చడం క్రిస్టియన్ మైకెల్ ను భారత్ కి తీసుకురావడంలో కొంత సాయపడి ఉండొచ్చు, కానీ అదొక్కటే కారణం కాకపోవచ్చని తెలిసింది. మైకెల్ ను అప్పగించాల్సిందిగా భారత్ 19 నెలల కిందటే కోరింది. ఈ వారంలో యుఏఈ దీనికి సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసింది. కానీ మైకెల్ పై ఇంటర్ పోల్ 2015 నవంబర్ లోనే రెడ్ నోటీస్ విడుదల చేసింది. మైకెల్ బ్రిటిష్ పౌరుడైనందువల్ల అప్పగింత చాలా జాగ్రత్తగా జరపాల్సి వచ్చింది. అతను బ్రిటిష్ జాతీయుడనే కారణంతో  యుఏఈ భారత్ వినతులను తోసి పుచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, యుఏఈ యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ ల మధ్య బలంగా పెనవేసుకున్న వ్యూహాత్మక సంబంధాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాయి. అందువల్లే భారత్.. న్యాయ, దౌత్యపరంగా ఈ అప్పగింతను ఘనవిజయంగా భావిస్తోంది.