దేశానికే రోల్ మోడల్ గా హైదరాబాద్

దేశానికే రోల్ మోడల్ గా హైదరాబాద్

హైదరాబాద్‌లో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రహదారుల విస్తరణ జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఉప్పల్ కారిడార్ అంబర్ పేట ఫ్లై ఓవర్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో అద్భుతమైన ప్రజారవాణా వ్యవస్థ ఉందని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.   అలాగే.. హైదరాబాద్ ను దేశంలోనే రోల్ మోడల్ గా తయారు చేస్తున్నామని తెలిపారు. 

'హైదరాబాద్‌ పరిధిలోని 54 కూడళ్లలో ఫ్లైఓవర్ లు నిర్మిస్తున్నాం. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రహదారులు విస్తరిస్తున్నాం. నగరంలోని నాలుగు కూడళ్లలో రహదారుల విస్తరణ జరుగుతుంది. కేంద్రం సహకరిస్తే ఎస్‌ఆర్‌డీపీ పనులు ఊపందుకుంటాయి. ఇప్పటికే 3వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. మరో నాలుగువేల కోట్లతో రహదారుల పనులు త్వరలో మొదలుకానున్నాయి' అని కేటీఆర్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, తుమ్మల నాగేశ్వరరావు, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహేందర్‌రెడ్డి, నగర మేయర్‌ రామ్మోహన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.