ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లలో ధోనీ జంప్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లలో ధోనీ జంప్

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో వరుసగా 3 హాఫ్ సెంచరీలు కొట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐసీసీ సోమవారం విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ తాజా ర్యాంకింగులలో 3 స్థానాలు ఎగబాకాడు. దిగ్గజ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఇప్పుడు బ్యాటింగ్ ర్యాంకులలో 17వ స్థానంలో నిలిచాడు. ధోనీ ఆస్ట్రేలియాలో ఆడిన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో 51, 55 నాటౌట్, 87 నాటౌట్ ఇన్నింగ్స్ లు ఆడాడు. ఎంఎస్ అద్భుత ప్రదర్శనతో భారత్ మొదటిసారి ఆస్ట్రేలియాలో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్ ను గెలుచుకోగలిగింది.

టీమిండియా మిడిలార్డర్ ను బలోపేతం చేసిన కేదార్ జాదవ్ కూడా 8 స్థానాలు పైకి పాకి 35వ స్థానం సాధించాడు. రన్ మెషీన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో చివరి రెండు మ్యాచ్ లు విశ్రాంతి పొందిన కోహ్లీ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించిన రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ తో ఇన్నింగ్స్ ప్రారంభించే శిఖర్ ధావన్ 744 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాడు.

ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకులలో భారత్ తన బలమైన ముద్ర వేసింది. జస్ ప్రీత్ బుమ్రా మొదటి స్థానంలో కొనసాగుతుండగా చైనా మ్యాన్ కుల్దీప్ యాదవ్, లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగులలో భారత్ 122 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. భారత్ చేతిలో 1-4తో చిత్తయిన కివీస్ జట్టు నాలుగో స్థానానికి చేరుకుంది.