ధోనీని దాటేసిన పంత్...

ధోనీని దాటేసిన పంత్...

ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని దాటేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో పంత్ 21 స్థానాలు మెరుగుపరచుకొని 17వ స్థానానికి చేరుకున్నాడు. దీంతో ధోనిని అధిగమించి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన ఇండియన్ వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. ఇంతకుముందు ఫరూక్ ఇంజినీర్ కూడా 17వ ర్యాంక్ సాధించాడు. ధోనీ టెస్ట్ కెరీర్‌లో అత్యుత్తమంగా 19వ ర్యాంక్ సాధించాడు. ఇక పంత్ ఖాతాలో ప్రస్తుతం 673 పాయింట్లు ఉన్నాయి. ధోనీ తన కెరీర్‌లో అత్యధికంగా 662 పాయింట్లు సాధించాడు. ఇందులో కూడా ధోనీని దాటేశాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పుజారా 521 పరుగులు చేయడంతో టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మళ్లీ అగ్రస్థానంను నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించిన రవీంద్ర జడేజా, మయాంక్‌ అగర్వాల్‌ కూడా బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. జడేజా 57వ స్థానంలో, మయాంక్‌ 62వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కూడా టీమిండియా బౌలర్లు తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. జడేజా ఒక స్థానం మెరుగుపర్చుకుని ఐదో స్థానంలో నిలిచాడు. టాప్ ఐదో స్థానంలో టీమిండియా నుండి జడేజా ఒక్కడే ఉన్నాడు. జస్పిత్‌ బుమ్రా 16, షమీ 22వ స్థానాల్లో కొనసాగుతున్నారు. స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ ఏడు స్థానాలు ఎగబాకి 45వ స్థానంలో నిలిచాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ ప్లేస్‌లో ఉంది.