గంగ ప్రక్షాళన కోసం ప్రాణత్యాగం

గంగ ప్రక్షాళన కోసం ప్రాణత్యాగం

హిందువులకు అతి పవిత్రమైన గంగానదిని ప్రక్షాళన చేసేందుకు గంగా యాక్ట్ అమలు చేయాలన్న డిమాండ్ తో 109 రోజులుగా ఆమరణ దీక్షలో ఉన్న ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ జేడీ అగర్వాల్‌ ఉరఫ్ స్వామి జ్ఞాన్‌ స్వరూప్‌ సనంద్‌ (86) కన్నుమూశారు. జూన్‌ 22 నుంచి నిరాహార దీక్షకు దిగిన అగర్వాల్‌ మంగళవారం నుంచి నీరు తాగడం కూడా ఆపేశారు. దీంతో బుధవారం మధ్యాహ్నం ఉత్తరఖాండ్‌ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. అగర్వాల్‌ను చికిత్స కోసం రిషికేష్‌లోని ఎయిమ్స్‌కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.

తక్షణమే గంగా ప్రక్షాళన చేపట్టాలని ప్రొఫెసర్ అగర్వాల్ ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలని కోరుతున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో  జూన్‌ 22 నుంచి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గంగా ప్రక్షాళన కోరుతూ 2008 నుంచి ఆయన నిరాహార దీక్షలు చేయడం ఇప్పటికి ఇది ఆరోసారి. జేడీ అగర్వాల్‌ మృతిపై వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖలు నివాళులర్పిస్తున్నారు. జేడీ అగర్వాల్‌ గంగ కోసం ప్రాణాలను అర్పించారని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.