దినేష్ కార్తీక్ సింగిల్ వద్దనడమే కొంప ముంచిందా?

దినేష్ కార్తీక్ సింగిల్ వద్దనడమే కొంప ముంచిందా?

ఇవాళ హ్యామిల్టన్ లో న్యూజిలాండ్, టీమిండియాల మధ్య జరిగిన సిరీస్ నిర్ణయించే మూడో వన్డే నిదహాస్ ట్రోఫీని గుర్తు చేసింది. భారత్ కి రెండు ఓవర్లలో 30 పరుగులు కావాలి. ఓ వైపు దినేష్ కార్తీక్ వరసపెట్టి సిక్సులు బాదేస్తున్నాడు. మరోవైపు కృనాల్ పాండ్యా వికెట్ పడనీయకుండా అతనికి చక్కటి సహకారం అందిస్తున్న ఫ్యాన్స్ లో ఇంక మ్యాచ్ మనదేనన్న ఆశలు రేకెత్తాయి. కానీ చివరి ఓవర్ లో కార్తీక్ పాండ్యాను సింగిల్ వద్దని తిప్పి పంపాడు. మూడు బంతుల తర్వాత భారత్ 4 పరుగులు స్వల్ప తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. ఇదే ఆటలో టర్నింగ్ పాయింటనే వాదనలు వినిపిస్తున్నాయి.

19వ ఓవర్ లో కార్తీక్, కృనాల్ కొట్టిన సిక్సులతో భారత్ విజయలక్ష్యం 16 పరుగుల దగ్గర నిలిచింది. టిమ్ సౌదీ వేసిన చివరి ఓవర్ మొదటి బంతిని ధోనీ తరహాలో హెలీకాప్టర్ షాట్ కొట్టబోయి మిస్సయ్యాడు కార్తీక్. అయినప్పటికీ రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బంతి వైడ్ గా ప్రకటించాలన్న కార్తీక్ వినతిని అంపైర్ తిరస్కరించారు. ఆ తర్వాత డెలివరీని లాంగాన్ వైపు కొట్టాడు. కృనాల్ సగం పిచ్ కి పైగా పరిగెత్తాడు కానీ దినేష్ కార్తీక్ అతనిని వెనక్కి పంపాడు. మిగిలిన బంతులను సిక్సులు కొడతాననే ఆత్మవిశ్వాసం కనిపించింది. ఆ తర్వాత బాల్ కి కార్తీక్ ఒక పరుగే చేయాల్సి వచ్చింది. చివరి బంతిని సిక్స్ గా మలచినా భారత్ 4 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది.