తొలి వన్డేలో భారత్‌కు షాక్‌

తొలి వన్డేలో భారత్‌కు షాక్‌

భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆసీస్‌.. వన్డే సిరీస్‌ను విక్టరీతో ప్రారంభించింది. సిడ్నీలో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. భారత్‌ జట్టును 34 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రోహిత్‌ శర్మ అద్భుత శతకం(133)తో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. 

తొలుత బ్యాటింగ్‌ చేసి ఆస్ట్రేలియా 50 ఓవ‌ర్లలో 5 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఖ‌వాజా (59), షాన్ మార్ష్ (54), హ్యాండ్స్ కోంబ్ (73) అర్థ సెంచ‌రీలు చేశారు. స్టోనిస్ (43 బంతుల్లో 47 ; 2 ఫోర్లు, 2 సిక‌ర్లు) చివర్లో మెరిశాడు. భార‌త బౌలర్లలో భువనేశ్వర్‌,  కుల్దీప్‌ల‌కి చెరో రెండు వికెట్లు, జడేజాకు ఒక వికెట్‌ దక్కింది. 

289 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోకే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 4 పరుగులకే 3 వికెట్లు కోల్పయింది. ధవన్‌, రాయుడు పరుగులేమీ చేయకుండానే వెనుదిరగ్గా, కోహ్లీ 3 పరుగులతో నిరాశ పర్చాడు. ఈ దశలో టీమిండియాను ధోనీ-రోహిత్‌ ఆదుకున్నారు. 

ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 51 పరుగులు చేసి ధోనీ అవుటయ్యాడు. ఫినిషర్‌గా మంచి టచ్‌లో ఉన్న కార్తీక్‌ కూడా 12 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత జడేజా, రోహిత్‌, కుల్దీప్‌, షమీ వెనువెంటనే అవుటవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. 50 ఓవర్లు ముగిసే సరికి భారత్ 9 వికెట్ల నష్టానికి 254 పరుగులే చేసింది.