మళ్లీ బ్యాట్ పట్టుకోను

మళ్లీ బ్యాట్ పట్టుకోను

ఆట నుంచి రిటైరయ్యాక క్రికెటర్లు టీ20 లీగ్ లు లేదా కౌంటీ క్రికెట్ ఆడటం పరిపాటి. కానీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్లాన్లు మాత్రం మిగతా వాళ్లకి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. క్రికెట్ నుంచి రిటైరయ్యాక మళ్లీ బ్యాట్ పట్టుకొనేది లేదని విరాట్ స్పష్టం చేశాడు. రిటైర్మెంట్ ప్లాన్ల గురించి ఆస్ట్రేలియా మీడియా అడిగిన ప్రశ్నలకు కోహ్లీ షాకిచ్చే సమాధానం ఇచ్చాడు. రిటైర్మెంట్ తీసుకున్నాక కానీ బీసీసీఐ నిబంధనలు సడలించినా ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్ బ్యాష్ లీగ్ లో ఆడతారా అని అడిగితే ఒకసారి ఆట నుంచి వైదొలిగాక తను ఇంక ఎలాంటి టోర్నమెంట్ లోనూ ఆడేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పాడు.

ఆస్ట్రేలియాతో శనివారం మొదటి వన్డే జరగనుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘భవిష్యత్తులో ఆట తీరు ఎలాంటి మార్పులకు లోనవుతుందో నాకు తెలియదు. నా మటుకు నేను ఒకసారి క్రికెట్ నుంచి రిటైరైతే ఇతర టోర్నమెంట్లలో ఆడే మిగతావాళ్లలాగా అయితే ఆడబోను’ అని స్పష్టం చేశాడు. ఏబీ డివిలీర్స్, బ్రెండన్ మెకల్లమ్ వంటి క్రికెటర్లు రిటైరైనప్పటికీ ఐపీఎల్, బిగ్ బ్యాష్ లీగ్ వంటి టీ20 క్రికెట్ లీగ్ లలో ఆడుతున్నారు. వారి సరసన చేరడంలో తనకే మాత్రం ఆసక్తి లేదని కోహ్లీ కుండబద్దలు కొట్టారు. ‘ఐదేళ్లుగా నేను కావాల్సినంత క్రికెట్ ఆడాను. ఆట నుంచి తప్పుకున్నాక ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. కానీ మరోసారి బ్యాట్ మాత్రం ముట్టనని’ చెప్పాడు.

‘ఏ రోజైతే ఆడటం మానేస్తానో ఆ రోజే నాలో ఉన్న శక్తి హరించుకుపోయినట్టు. అప్పుడే నేను క్రికెట్ ఆడటం మానేస్తాను. అందుకని నేను మరోసారి మైదానంలోకి దిగి ఆడే ప్రసక్తే లేదని’ తెలిపాడు.