అన్ని విభాగాల్లో విఫలమయ్యాం: రోహిత్

అన్ని విభాగాల్లో విఫలమయ్యాం: రోహిత్

బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో విఫలమయ్యాం కాబట్టే తొలి టీ20లో ఓడిపోయామని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బుధవారం వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు.

'ఇది మాకు కఠినమైన మ్యాచ్. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. ఆరంభంలో శుభారంభం లభించలేదు. ఇక్కడి మైదానం చిన్నవిగా ఉన్నా.. 200లకు పైగా పరుగులు ఛేదించడం అంత సులువు కాదు. భారీ లక్ష్యం చేధించే క్రమంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయాం. గతంలో ఇటువంటి లక్ష్యాలను ఛేదించాం. అందుకే ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగినా  ఓడిపోయాం. మ్యాచ్ లో చిన్న భాగస్వామ్యాలను కూడా నమోదు చేయలేకపోయాం. అయితే భారీ లక్ష్యాలను చేదించేటపుడు భాగస్వామ్యాలు నెలకొల్పడం కష్టం' అని రోహిత్ అన్నాడు.

'న్యూజిలాండ్‌ అద్భుతంగా ఆడింది. వారు మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంతో భారీ స్కోర్ చేశారు. రెండో టీ20 జరిగే అక్లాండ్‌ పరిస్థితులను అంచనా వేసి ముందుకు వెళ్ళాలి. అక్లాండ్‌లో జట్టుగా మంచి ప్రదర్శణ చేస్తామని ఆశిస్తున్నా. లక్ష్యం ఎంత ఉన్నా గెలవాలనుకున్నాం. కానీ ఈ రోజు గెలవలేకపోయాం' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.