పాక్‌పై విజయం.. ఫైనల్లో భారత్‌

పాక్‌పై విజయం.. ఫైనల్లో భారత్‌

భారత మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థి పాక్‌పై ఘన విజయం సాధించి ఆసియా కప్‌ టీ-20 టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. పాకిస్థాన్ పై భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మలేసియా కౌలాలంపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్‌ నెగ్గిన పాక్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత బౌలర్లు శిఖా పాండే, గోస్వామి కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పాక్‌ ఓపెనర్లు తడబడ్డారు. పాక్ ఓపెనర్‌ నైన్‌ అబిది(0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌ చేరింది. అనంతరం గ్రీజ్ లోకి వచ్చిన పాక్ కెప్టెన్ మారూఫ్(4), జవేరియా ఖాన్(4)లు కూడా త్వరగానే అవుట్ అవడంతో మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది పాక్. ఈ దశలో నహీద ఖాన్‌(18), సనా మిర్‌(20)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసమయానికి నహీద ఖాన్‌ పెవిలియన్ చేరడంతో.. తర్వాత వచ్చినవారు ఎవరూ కూడా ఎక్కువసేపు గ్రీజ్ లో నిలవలేకపోయారు. చివరకు సనా మిర్‌ కు సహకారం ఇచ్చేవారే లేకపోవడంతో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 72 పరుగులకే పరిమితమయింది. భారత బౌలర్‌ ఏక్తా బిస్త్‌ తన కోట నాలుగు  ఓవర్లలో 14 పరుగులిచ్చి మూడు వికెట్లను తీసింది.

అనంతరం 73 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 16.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత జట్టుకు కూడా శుభారంభం దక్కలేదు. భారత ఓపెనర్‌ మిథాలీ రాజ్‌(0) మొదటి ఓవర్లోనే డక్ ఓట్ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(0) కూడా డకౌట్‌గా పెవిలియన్ చేరింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. మరో ఓపెనర్‌ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ ను గాడిలో పెట్టింది. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టి మ్యాచ్‌ను రేసులోకి తెచ్చారు. 15 ఓవర్లలో స్మృతి మంధాన(38) ఔటైనా.. హర్మన్‌ చివరివరకు గ్రీజ్ లో ఉండి భారత్‌కు విజయాన్ని అందించింది. 'ప్లేయర్ అఫ్ ది మ్యాచ్' అవార్డు ఏక్తా బిస్త్‌కు లభించింది. ఆదివారం ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది.

Photo: FileShot