ఇంటర్‌కాంటినెంటల్‌ కప్‌లో భారత్ విజయం

ఇంటర్‌కాంటినెంటల్‌ కప్‌లో భారత్ విజయం

ముంబయి ఫుట్‌బాల్‌ ఎరీనాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ 2-0తో కెన్యాపై విజయం సాధించి ఇంటర్‌కాంటినెంటల్‌ ఫుట్‌బాల్‌ కప్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత కెప్టెన్‌ సునీల్‌ చెత్రీ రెండు గోల్స్‌ చేయడంతో పాటు.. డిఫెండర్లు మెరుగైన ప్రదర్శనతో భారత్ అద్భుత విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్‌(8వ, 29వ నిమిషాల్లో) కెప్టెన్ చెత్రీ చేసినవే. మరోవైపు కెన్యా ఖాతా కూడా తెరవలేదు. చెత్రీ ఎనిమిదో నిమిషంలో థాపా నుంచి పాస్‌ను అందుకుని గోల్ కొట్టాడు. ఇక 29వ నిమిషంలో సెంటర్‌ బ్యాక్‌ నుంచి వచ్చిన పాస్‌ను కాలితో గోల్‌ పోస్టులోకి పంపాడు. దీంతో విరామానికి ముందే భారత్‌ 2-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక రెండో భాగంలో భారత గోల్‌కీపర్లు కెన్యా గోల్స్ ను అడ్డుకోవడంతో.. కెన్యా జట్టు ఒక్క గోల్ కూడా చేయలేదు. దీంతో భారత్‌ చేతిలో 2-0తో ఓటమిపాలయింది.

ఈ టోర్నీ మొత్తంలో భారత్‌ తరఫున మొత్తం 11 గోల్స్‌ నమోదయ్యాయి. అందులో చెత్రీ ఒక్కడే 8 గోల్స్‌ చేసాడు. ఈ మ్యాచ్ లో రెండు గోల్స్ తో మెరిసిన కెప్టెన్ చెత్రీ అత్యధిక గోల్స్‌ చేసిన రెండో ప్లేయర్‌గా అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనల్ మెస్సీ సరసన చేరాడు. మెస్సీ 124 మ్యాచ్‌ల్లో 64 గోల్స్‌ చేయగా.. చెత్రీ 102 మ్యాచ్‌ల్లోనే 64  గోల్స్‌ చేసాడు. పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. రోనాల్డో 150 మ్యాచ్‌ల్లో 81 గోల్స్‌ సాధించాడు.  

Photo: FileShot