రైళ్లలో ఇక ఫుడ్ ఈజీ...

రైళ్లలో ఇక ఫుడ్ ఈజీ...

రైళ్లలో సిబ్బంది ఆహారానికి నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారా? ఇకపై ఆ పప్పులు ఉడకవు. ఎందుకంటే మీరు ఏ ఆహారానికి ఎంత చెల్లించాలో తెలిపే యాప్ ను ఐఆర్ సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. దీంతో మీరు ఆహారం ఆర్డర్ చేసేటపుడు యాప్ ను ఓ సారి చూసుకుని అందులో పేర్కొన్న ఎమ్మార్పీ ధరల ప్రకారం చెల్లిస్తే సరిపోతుంది. తాము అందించే ఆహారం, వాటి ధరలపై రైలు ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకు ఐఆర్ సీటీసీ మెనూ ఆన్ రైల్ అనే మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. దీనిలో అన్ని రకాల రైళ్లలో అందించే ఆహారం, వాటి రేట్లు ఉండబోతున్నాయి. 

సాధారణంగా ఉండే టీ, కాఫీ, వాటర్ బాటిల్, జనతా ఖానా, శాకాహార, మాంసాహార థాలీలు, ఇతర అన్ని రకాల ఆహారాల ధరలు రైలులో అయితే ఎంత చెల్లించాలి? స్టేషన్లలో (ఫుడ్ ప్లాజాలు, ఫాస్ట్ ఫుడ్ యూనిట్లను మినహాయించి) అయితే ఎంత రేటు అనేది మెనూ ఆన్ రైల్ యాప్ ను చూసి ఇట్టే తెలుసుకోవచ్చు. అల్పాహారం మొదలు అన్ని రకాల ఆహారపదార్థాలు.. మొత్తం 96 ఐటమ్స్ ధరల వివరాలు ఈ యాప్ లో ఉంటాయి. 

బ్రేక్ ఫాస్ట్, లైట్ మీల్స్, కాంబో మీల్స్, నాన్ వెజ్, జైన్ ఫుడ్, డయాబెటిక్ ఫుడ్ వంటివన్నీ యాప్ లో అందుబాటులో ఉంచారు. శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో టికెట్ బుక్ చేసేటపుడే ముందుగా ఆర్డరిస్తే అన్నిరకాల ఆహారపదార్థాలు సప్లయి చేస్తారు. లేటుగా నడుస్తున్న రైళ్లలో అందించే ఆహార పదార్థాల వివరాలు కూడా మెనూ ఆన్ రైల్ యాప్ లో చూడవచ్చు.