త్వరలోనే గగన్‌యాన్‌ మిషన్‌ ప్రారంభం

త్వరలోనే గగన్‌యాన్‌ మిషన్‌ ప్రారంభం

త్వరలోనే గగన్‌యాన్‌ మిషన్‌ ప్రారంభం కాబోతోందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ తెలిపారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ.. ఇస్రోకి గగన్‌యాన్‌ పెద్ద మరపురానిదిగా నిలవబోతోందని అన్నారు. 2020 డిసెంబర్‌ నాటికి రెండు మానవరహిత అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు శివన్ చెప్పారు. ఇస్రో తదుపరి ప్రాజెక్టు పీఎస్‌ఎల్‌వీ సీ-44 అని అన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా 6 ఇస్రో ఇంక్యుబేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, మార్చి 25 నుంచి ఏప్రిల్‌లోగా చంద్రయాన్‌-2 ప్రయోగం చేయనున్నట్లు శివన్ వెల్లడించారు.

ఇస్రో సాంకేతిక పరిజ్ఞానంలో మేటి అయిన భారీ రాకెట్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్-3 ( జీఎస్ఎల్‌విఎంకే -3) ద్వారా మిషన్ గగన్‌యాన్ ఆపరేషన్ చేపట్టబోతున్నారు. భారత్ నుంచి ఇస్రో ప్రయోగిస్తున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ఇది. దీంతో ఇప్పటికే మానవ సహిత అంతరిక్ష మిషన్స్ నిర్వహించిన అమెరికా, చైనా, రష్యా జాబితాలో ఇండియా చేరబోతోంది. గగన్‌యాన్ సేవలు అందుబాటులోకి వస్తే విద్యా సంస్థలు, పరిశ్రమలు, జాతీయ సంస్థలు, ఇతర సైంటిఫిక్ సంస్థల మధ్య సమన్వయం సాధ్యపడనుంది.