ముస్లింలపై ఆయనది కపట ప్రేమ: జగన్

ముస్లింలపై ఆయనది కపట ప్రేమ: జగన్

దేశంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేని కేబినెట్ ఏదైనా ఉందా అంటే అది చంద్రబాబు ప్రభుత్వమేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ముస్లింలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖపట్నంలోని అరిలోవలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్ పాల్గోన్నారు. టీడీపీ పాలనలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని.. కేవలం ఎన్నికల సమయంలోనే ఆయనకు ముస్లింలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. ఇటీవల గుంటూరులో జరిగిన నారా హమారా.. ముస్లిం హమారా కార్యక్రమంలో ముస్లింలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం ఎందుకు లేదని ప్రశ్నించిన ముస్లిం పిల్లలపై అన్యాయంగా కేసులు పెట్టారని మండిపడ్డారు.

చంద్రబాబు హయాంలో కార్పొరేషన్లు పూర్తిగా అవినీతిమయంగా మారయని.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేషన్‌ వ్యవస్థను పూర్తిగా ప్రక్షళణ చేస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ దుల్హన్ పథకం ద్వారా వివాహ సమయంలో ప్రతీ ఆడబిడ్డకు లక్ష రూపాయలు అందచేస్తామన్నారు. 2014లో ఎన్నికల సమయంలో ముస్లింల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. కానీ నాలుగేళ్ల కాలంలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. 2017-18 బడ్జెట్‌లో ముస్లింల సంక్షేమం కోసం 850 కోట్లు  కేటాయించి, దానిలో కేవలం 350 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని ఆరోపించారు. ముస్లింలకు ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి వాటి ద్వారా ముస్లింలకు రుణాలు మంజూరు చేస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ నాలుగేళ్లయినా ఇంత వరకూ ఏర్పాటు చేయలేదు. ఫాతిమా మెడికల్‌ కాలేజ్‌ విద్యార్ధులను అత్యంత ఘోరంగా మోసం చేశారని ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.