ఆయన సంగారెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారు

ఆయన సంగారెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారు

జగ్గారెడ్డిని జైలులో పెట్టినా ఆయన భారీ మెజార్టీతో గెలుస్తారని కాంగ్రెస్ మహిళా నాయకురాలు గీతారెడ్డి తెలిపారు. ఈ రోజు సంగారెడ్డిలో జరిగిన మైనార్టీ గర్జన సభలో ఆమె మట్లాడుతూ, 12 శాతం రిజర్వేషన్ పేరుతో ముస్లిం మైనార్టీలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఈ కేసులో ఉన్న పెద్దవాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు. మీరందరూ జగ్గారెడ్డి కుటుంబానికి అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. 

14 ఏళ్ల కిందటి కేసును బయటకు తీసి.. జగ్గారెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయించారన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గీతారెడ్డి ఆరోపించారు. ఈ సభకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.