సంక్షోభంలో జెట్‌ ఎయిర్ వేస్

సంక్షోభంలో జెట్‌ ఎయిర్ వేస్

జెట్‌ ఎయిర్ వేస్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కంపెనీ నిర్వహణకు 60 రోజులకు మించి నిధులు లేవని  ప్రకటించి మార్కెట్ ను ఆశ్చర్య పరచిన కంపెనీ జూన్‌తో ముగిసిన త్రైమాసానికి ఆర్థిక ఫలితాలు వెల్లడించడంలో విఫలమైంది. వాస్తవానికి కంపెని డైరెక్టర్ల బోర్డు గురువారం  సమావేశమై కంపెనీ ఆర్థిక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ప్రకటించాల్సింది. కంపెనీ ఆదాయం, లెక్కలకు సంబంధించిన వివరాలపై కంపెనీ ఉద్యోగులకు, ఆడిటర్లకు మధ్య విభేదాలు ఏర్పడటంతో... ఫలితాల నివేదికపై సంతకం చేసేందుకు ఆడిటర్లను నిరాకరించారు. దీంతో నిన్న భేటీ అయిన డైరెక్టర్ల బోర్డు ఫలితాలు ప్రకటించకుండానే ముగిసింది. ఆడిట్ కమిటీ తమ పరిశీలనకు ఆర్థిక ఫలితాలు పంపనందున తాము వాటిని పరిగణించలేదని కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. అయితే లిస్టింగ్ నిబంధనల మేరకు పూర్తి సమాచారం కంపెనీ తమకు ఇవ్వాల్సి ఉందని, కాని ఆ నిబంధనల మేరకు మరికొంత సమాచారం  సమర్పించాల్సిందిగా కంపెనీని స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆదేశించాయి. కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నందున ఫలితాలను పరిగణనలోకి తీసుకోలేదని రాత్రి ఎక్స్ఛేంజీలకు జెట్‌ ఎయిర్ వేస్ తెలిపింది. పెండింగ్ లో ఆ కొన్ని అంశాలేవిటో తెలపాల్సిందిగా కంపెనీని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ ఆదేశించింది. కంపెనీ గురువారం నాటి భేటీకి సంబంధించి మీడియాలో వార్తలు వచ్చాయని, దాన్ని బట్టి చూస్తే కంపెనీ పూర్తి సమాచారం వెల్లడించలేదని తమకు తెలుస్తోందని బీఎస్ఈ పేర్కొంది.