రేపటి నుంచి కరీంనగర్‌కు రైలు

రేపటి నుంచి కరీంనగర్‌కు రైలు

కరీంనగర్‌ జిల్లా ప్రజలకు రైల్వేశాఖ శుభవార్తను తెలిపింది. ఒకవైపు కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ పనులు జరుగుతుండగానే మరో మార్గం ద్వారా హైదరాబాద్‌కు రైలును నడపనున్నారు అధికారులు. ఈ నెల 15 న కాచిగూడ నుంచి కరీంనగర్‌ వరకు నడిచే రైలును కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రారంభించనున్నారు. ఈ  నూతన రైలును ప్రతిరోజు కాచిగూడ నుండి నిజామాబాద్‌, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల మీదుగా కరీంనగర్‌ వరకు నడపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్‌ ప్యాసింజర్‌(57601) రైలు కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుండి బయలుదేరి సీతాఫల్‌మండి, మల్కజ్‌గిరి, బొల్లారం, కామారెడ్డి, నిజామాబాద్‌, ఆర్మూర్‌, మెట్‌పల్లి,  కోరుట్ల, లింగంపేట, జగిత్యాల, గంగాధర, కొత్తపల్లి మీదుగా కరీంనగర్‌కు చేరుకుంటుంది. ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన ఈ రైలు మధ్యాహ్నం 2  గంటలకు కరీంనగర్‌ చేరుకుంటుంది. అనంతరం ఈ రైలు తిరిగి కరీంనగర్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు బయల్దేరి రాత్రి 11 గంటలకు కాచిగూడకు చేరుతుంది. ఈ నిజామాబాద్‌ ప్యాసింజర్‌(57601) రైలును 12 బోగీలతో నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మరోవైపు కరీంనగర్‌ నుంచి ముంబైకి కూడా రైలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబై నుంచి నిజామాబాద్‌కు నడిచే లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ను కరీంనగర్‌ వరకు పొడిగించాలని అధికారులు చూస్తున్నట్లు తెలుస్తుంది.