విజయ్ కి మద్దతు తెలిపిన లోకనాయకుడు

విజయ్ కి మద్దతు తెలిపిన లోకనాయకుడు

ఇళయ దళపతి విజయ్ నటించిన సర్కార్ సినిమా తమిళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించి దూసుకెళ్తోంది. రాజకీయ నేతలంతా ఈ చిత్రంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా అధికార ఏఐఏడీఎంకే సర్కార్ పై ఇంతెత్తున లేస్తున్నారు. కొందరు రూలింగ్ పార్టీ సభ్యులు కొన్ని సీన్లను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత బహుమతులను ప్రజలు విసిరికొట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. విలన్ పాత్రకు మాజీ సీఎం జయలలిత అసలు పేరుగా చెప్పుకొనే కోమలవల్లి అని పేరు పెట్టడాన్ని తప్పు పడుతున్నారు.

ఇక వివాదాలతో సావాసం చేసే లోకనాయకుడు కమల్ హాసన్ సర్కార్ వివాదంలో తలదూర్చారు. విజయ్, చిత్ర యూనిట్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. చట్టబద్ధంగా సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలైన సినిమాలపై అక్రమంగా ఒత్తిడి తేవడం ఈ ప్రభుత్వానికి కొత్తేం కాదని వ్యాఖ్యానించారు. విమర్శలను ఎదుర్కొనే ధైర్యం లేని ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని చెప్పారు. త్వరలోనే రాజకీయ వ్యాపారుల ముఠా మూలాలతో సహా నాశనం కాకతప్పదన్నారు. మంచివాళ్లంతా ఏకమై అధికారంలోకి రానున్నారని చెప్పారు.