బీజేపీపై చంద్రబాబు విషబీజం నాటారు 

బీజేపీపై చంద్రబాబు విషబీజం నాటారు 

నమ్మిన వారిని వెన్నుపోటు పొడవటం చంద్రబాబు సహజగుణమని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అడిగినవి అన్నీ చేస్తున్నా చంద్రబాబు తమ పార్టీపై దుష్ప్రచారం  చేస్తున్నారని విమర్శించారు. ఏపీ రాజధాని శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని 'నీరు, మట్టి' ఇచ్చారని గతంలో చంద్రబాబు ప్రచారం చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజల మనసుల్లో విష బీజం నాటారని తెలిపారు.

సీఎం ఆసమర్ధత, అవినీతి వల్లే ఇలా జరుగుతుందని అమిత్ షా కు వివరించినట్లు కన్నా తెలిపారు.  చంద్రబాబు 'యు టర్న్' ఎందుకు తీసుకున్నారని మోడీ తనను అడిగారని కన్నా పేర్కొన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు బీజేపిని  ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెడుతున్నారని విమర్శించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చట్టంలో ఉందని స్పష్టం చేశారు. ప్రజలు చంద్రబాబు మోసాన్ని గ్రహించిన రోజు ఏపీలో టీడీపీ నామ రూపాలు లేకుండా పోతుందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కన్నా లక్ష్మినారాయణ కోరారు.