కర్ణాటక ఎమ్మెల్యేల బేరసారాలపై దద్దరిల్లిన లోక్ సభ

కర్ణాటక ఎమ్మెల్యేల బేరసారాలపై దద్దరిల్లిన లోక్ సభ

కర్ణాటకలో ఎమ్మెల్యేల బేరసారాల అంశంపై ఇవాళ లోక్ సభ దద్దరిల్లింది. కర్ణాటక బీజేపీ చీఫ్ బీ ఎస్ యెడ్యూరప్ప ఆడియో క్లిప్ ఆధారంగా కాంగ్రెస్ దాడికి దిగింది. అధికార సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర వేస్తోందంటూ ఆరోపించింది. ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి సదానంద గౌడ ఖండించారు.

కర్ణాటక ఎమ్మెల్యేలకు ఎరల అంశంపై సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. కొన్ని నిమిషాల తర్వాత తిరిగి ప్రవేశించారు. బీజేపీ నాయకత్వం హార్స్ ట్రేడింగ్ కి పాల్పడుతోందని జీరో అవర్ లో లోక్ సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ సందర్భంగా యెడ్యూరప్ప ఆడియో క్లిప్ ని ప్రస్తావించారు. కర్ణాటకలో అధికార కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ కూటమికి చెందిన ఎమ్మెల్యేని కొనుగోలు చేసేందుకు యెడ్యూరప్ప ప్రయత్నించడం ఆ ఆడియో క్లిప్ లో ఉందని ఆయన తెలిపారు.

కర్ణాటక నుంచి ఎంపీగా ఎన్నికైన ఖర్గే మాట్లాడుతూ రాష్ట్రంలో శాసనసభ స్పీకర్ ని, జడ్జిలను కూడా తమకు అనుకూలంగా మార్చుకొనే పరిస్థితులు ఉన్నట్టు కొన్ని ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై సదానంద గౌడ సహా ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా ఆపరేషన్ కమల వంటివి జరగరాదని మాజీ ప్రధానమంత్రి, జెడిఎస్ అధినేత హెచ్ డి దేవె గౌడ అన్నారు. 

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జెడిఎస్ కూటమి మధ్య అంతర్గత పోరు నడుస్తోందని గుర్తు చూస్తూ కేంద్ర మంత్రి సదానంద గౌడ ఆరోపణలను తిప్పికొట్టారు. రెండు పార్టీలు ఉత్తుత్తి హడావిడి చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ కాపాడుకొనేందుకే ఆ రెండు పార్టీలు ఇలాంటి పనులు చేస్తున్నాయని గౌడ ఆరోపించారు. 'ఇక్కడ చెబుతున్నవన్నీ.. అసత్యాలు, సత్య దూరాలని' గౌడ చెప్పారు. 

కాసేపు కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు చూపిస్తూ వెల్ లో నిలబడ్డారు. ఆ ప్లకార్డులపై "ఆపరేషన్ కమల. డెత్ ఆఫ్ డెమోక్రసీ (ప్రజాస్వామ్య హత్య) " అని రాశారు. టీడీపీ సభ్యులు కూడా ఆంధ్రప్రదేశ్ సమస్యలను ప్రస్తావించాలని కోరుతూ వెల్ లోకి దూసుకెళ్లారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు వెల్ నుంచి కదల్లేదు. అంతకు ముందు కర్ణాటకలో బేరసారాల ఆరోపణలు, ఇతర అంశాలపై నిరసనల కారణంగా కొశ్చెన్ అవర్ సుమారు 50 నిమిషాల పాటు వాయిదా పడింది.