'రైతు బంధు'కు కేసీఆర్ దోస్తులు వచ్చేనా?

'రైతు బంధు'కు కేసీఆర్ దోస్తులు వచ్చేనా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో 'రైతు బంధు' ఒకటి... ఈ నెల 10 నుంచి రైతుబంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌బోతోంది సర్కార్. ఎక‌రాకు 8 వేల పెట్టుబ‌డి ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జ‌రుగుతున్నాయి. ఇత‌ర పార్టీల నేత‌లు, ఇత‌ర రాష్ట్రాల నేత‌లు సైతం రైతుబంధు ప‌థ‌కాన్ని అభినందించ‌టంతో ఈ ప‌థ‌కానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లేనని గులాబీ నేతలు భావిస్తున్నారు. అయిటే ఫెడర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఏర్పాట్లలో ఉన్న సీఎం కేసీఆర్... దానికి 'రైతు బంధు' పథకం ప్రారంభోత్సవానికి వేదికగా మార్చుకోవాలని భావిస్తున్నారట... అందులో భాగంగా ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు కూడా పంపించారు. మరీ కేసీఆర్ దోస్తులు వస్తారా? అనేది ఆసక్తిగా మారింది.

ఈ నెల 10న రైతుబంధు ప‌థ‌కం ప్రారంభ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నేత‌ల‌ను ఆహ్వానాలు పంపించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఫెడర్ ఫ్రంట్ ప్రయత్నాల్లో ఉన్న సీఎం కేసీఆర్... దానిలో భాగంగా తృణమూల్, జేడీఎస్, డీఎంకే, ఎస్పీ నేతలను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రైతు బంధు పథకం ప్రారంభ కార్యక్రమానికి కూడా వారిని ఆహ్వానిస్తున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జనతాదళ్ (ఎస్) చీఫ్, మాజీ ప్రధాని దేవేగౌడ, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె. స్టాలిన్, సమాజ్ వాది పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు ఆహ్వానిస్తున్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్‌... కేసీఆర్ ఆహ్వానాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే గతంలో ఒడిశా సీఎం నవీన్  పట్నాయక్‌ను కలుస్తారనే వార్తలు వచ్చినా... ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. ఆయనకు ఆహ్వానం పంపినట్టు తెలుస్తున్నా... ఆహ్వానంపై, ఆయన రావడంపై నవీన్ పట్నాయక్‌ నుంచి ఎలాంటి ధృవీకరణ లేదు. ఇక సమయం కూడా లేదు మరో రెండు రోజుల్లో జరగనున్న రైతుబంధు ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి ఎవరు వస్తారు? ఎవరు రారు అనేది ఆసక్తిగా మారింది. అయితే మరోవైపు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఇప్పటికే ముద్రిస్తుండగా... జాతీయ నేతల పేర్లు లేకుండానే కార్డులను ముద్రిస్తున్నట్టు సమాచారం.