కాంగ్రెస్‌, బీజేపీయే కారణం: కేసీఆర్‌

కాంగ్రెస్‌, బీజేపీయే కారణం: కేసీఆర్‌

భారత ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించేందుకు ఆర్థిక సంఘం నడుం బిగించాల్సి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మూస పద్ధతిలో కాకుండా తన పాత్రను వినూత్నంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొద్దిరోజుల్లో 15వ ఫైనాన్స్ కమిషన్ బృందం రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ, ఇతర సీనియర్ అధికారులతో ఇవాళ కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా రానున్న ఐదేళ్లలో ఇరిగేషన్‌ శాఖలో సాగునీటి కల్పనకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు కానున్నాయని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు సహా ఇతర శాఖల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌ను రూపొందించాలన్నారు.

తనను ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నందున.. వారికి ఎంత గొప్పగా సేవలందించగలనో ఆలోచన చేయాలన్న కేసీఆర్‌ ఆదరాబాదరాగా కాకుండా సమగ్ర అవగాహనకు వచ్చిన తర్వాతే బడ్జెట్‌ రూపకల్పన చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో కనీసం 100 పార్కులు ఉండాలని.. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేయాలని సూచిచంఆరు. రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్‌ను అద్భుతమైన గ్లోబల్‌ సిటీగా రూపొందించడానికి నిధులు కేటాయించాలని, ఇవి బడ్జెట్‌లో ప్రతిఫలించాలని సూచించారు.

రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పార్టీల ప్రభుత్వాలు వచ్చినా.. ఎటువంటి గుణాత్మక మార్పును తీసుకురాలేకపోయిన నేపథ్యంలో లోతైన విశ్లేషణ, ఆత్మావలోకనం చేసుకోవాల్సిన  అవసరం ఉందని అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో నిరసన వ్యక్తం చేస్తుండడం విచారకరమన్నారు. దీనికి కాంగ్రెస్‌, బీజేపీ అనే రెండు రాజకీయ వ్యవస్థలే మూలకారణమని అభిప్రాయపడ్డారు.

పురోగతి సాధిస్తున్న రాష్ట్రాల విధానాల్లో జోక్యం చేసుకోవద్దని తాను నీతి ఆయోగ్ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు స్పష్టం చేశానన్న కేసీఆర్‌.. రాష్ట్ర ప్రగతిని దేశ ప్రగతిగా పరిగణించాలని, పురోగతి సాధిస్తున్న రాష్ట్రాలను నిరుత్సాహపరచొద్దని సూచించారు. చిన్న చిన్న నిధులను విడుదల చేయడానికి కూడా అనేక నిబంధనలను విధిస్తున్నారని.. రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉండాల్సిన రాజ్యాంగ సంబంధం రోజురోజుకూ కనుమరుగవుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల అధికారాలు, హక్కుల పంపిణీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రాలను కించపరిచే విధంగా ఉండడం అత్యంత విచారకరమని కేసీఆర్‌ అన్నారు.