భారీ వర్షాలతో తెరుచుకున్న 22 రిజర్వాయర్ల గేట్లు

భారీ వర్షాలతో తెరుచుకున్న 22 రిజర్వాయర్ల గేట్లు

కేరళలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటి వరకు 26 మంది మృతిచెందారు. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న కేరళీయులకు రక్షణ కల్పించాలని ప్రధాని మోడీ ఎన్డీఆర్ఎఫ్‌ దళాలను ఆదేశించారు. కొండచరియలు విరిగిపడి ఇడుక్కి జిల్లాలో 11 మంది, ఉత్తర మళప్పురం జిల్లాలో ఆరుగురు, కన్నూరు, వయానాడ్ జిల్లాలో తొమ్మిది మందితో కలిపి మొత్తం 26 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.  రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సహాయచర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేసి, పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. 

భారీ వర్షాలతో కేరళ రాష్ట్రంలోని పలు డ్యాంలలో వరదనీరు వచ్చి చేరుకుంది. దీంతో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలోని 22 డ్యాంల గేట్లు తెరిచారు. ఇడుక్కీ రిజర్వాయర్‌ నీటి మట్టం పెరిగిపోయింది. డ్యామ్‌ గరిష్ట నీటిమట్టం 2,403 అడుగులు కాగా, గురువారం సాయంత్రం నాటికి 2,398 అడుగులకు చేరింది. వరద ఉదృతి పెరగడంతో అధికారులు గేట్లను ఎత్తివేశారు. కాగా 26 ఏళ్ల తరువాత ఇడుక్కీ డ్యామ్‌ గేట్లను ఎత్తివేయడం ఇదే తొలిసారి.