యెడ్యూరప్ప ఆడియో క్లిప్ వివాదంపై సిట్ దర్యాప్తు

యెడ్యూరప్ప ఆడియో క్లిప్ వివాదంపై సిట్ దర్యాప్తు

కర్ణాటక బీజేపీ చీఫ్ బీ ఎస్ యెడ్యూరప్ప ఆడియో క్లిప్ వివాదంలో సత్యాసత్యాలు కనిపెట్టేందుకు సిట్ ని ఏర్పాటు చేస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి సోమవారం ప్రకటించారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యెడ్యూరప్ప ఒక జేడీఎస్ ఎమ్మెల్యేకు ఎరవేసే ప్రయత్నం చేస్తున్న సంభాషణ తాలూకు ఒక ఆడియో క్లిప్ కుమారస్వామి బయటపెట్టారు.

ఈ ఘటనలో వాస్తవాలను వెలికి తీసేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. దీని తర్వాత కుమారస్వామి శాసనసభలో సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. స్పీకర్ రమేష్ కుమార్ పేరుని కూడా ఈ వివాదంలోకి లాగారు.

సభాపతిపై ఆరోపణలు వచ్చినందుకు తాను చాలా చింతిస్తున్నానని కుమారస్వామి అన్నారు. సిట్ ఏర్పాటు చేయాలన్న ఆయన సలహాను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలు రుజువైతే తను రాజకీయాల నుంచి సన్యాసం స్వీకరిస్తానని బీజేపీ సీనియర్ నేత యెడ్యూరప్ప ప్రకటించారు.