ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ఒంటరి పోరు?

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ఒంటరి పోరు?

రాబోయే లోక్ సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ లో మహాకూటమి ఉండబోదని తేలిపోయింది. శనివారం ఎస్పీ, బీఎస్పీ సంయుక్తంగా ప్రకటన చేయడంతోనే వాళ్లు కాంగ్రెస్ తో కలిసిపోవడానికి సిద్ధంగా లేరని స్పష్టమైంది. ఇక కాంగ్రెస్ ఒంటరి పోరాటానికి సిద్ధం కావాల్సిందే. అయితే ఎన్ని స్థానాల నుంచి పోటీ చేయాలన్నదే ఇప్పుడు ఆ పార్టీ ముందున్న ప్రశ్న. ఉత్తరప్రదేశ్ లో 60-65 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీలైనంత వరకు ముఖాముఖి పోరులో బీజేపీకి సాధ్యమైనంత నష్టం కలిగించేలా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. శుక్రవారం పార్టీ నాయకత్వ సమావేశంలో ఉత్తరప్రదేశ్ లో పార్టీ పోటీకి దిగే స్థానాలపై చర్చ జరిగింది. కేంద్రంలో అధికారానికి వచ్చేందుకు కీలకమైన యుపిలో కాంగ్రెస్ పాత్రపై పూర్తిస్థాయిలో విశ్లేషణలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. 60-65 మంది అభ్యర్థులను బరిలో దింపే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 

‘మిగిలిన సీట్లను ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలకు వదిలేస్తామని’ యుపి కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. బీజేపీని ముఖాముఖి పోరులో ఢీ కొట్టేందుకు ఎస్పీ-బీఎస్పీ కూటమితో వ్యూహాత్మక అవగాహనకు వచ్చినట్టు సూచనప్రాయంగా చెప్పారు. గత ఏడాది కైరానా, నూర్ పూర్ ఉప ఎన్నికల్లో ఇలాంటి ఏర్పాటు విజయవంతమైంది. కాంగ్రెస్, బీఎస్పీ తమ అభ్యర్థులను నిలబెట్టకుండా ఆర్ఎల్డీ, ఎస్పీ కేండిడేట్స్ కి మద్దతు తెలిపాయి. దీంతో వారు విజయం సాధించారు. యుపిలో ప్రాంతాలవారీగా పరిస్థితులు అంచనా వేసిన తర్వాత ఏఏ సీట్లలో పోటీ చేయాలో నిర్ణయించాలని కాంగ్రెస్ నాయకత్వం నిశ్చయించింది. ముస్లిం ఓట్లు చీలకుండా ఎస్పీ కంటే బీఎస్పీకి ఎక్కువ సీట్లు వదిలే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే ముస్లింలు బీఎస్పీకి బలమైన దళిత-ముస్లిం జోడీగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ బీజేపీకి బలంగా మద్దతునిచ్చే అగ్రవర్ణాల ఓటు బ్యాంకులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించనుంది. ఇందుకోసం యుపి కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ స్థానంలో బ్రాహ్మణుడైన మాజీ ఎంపీ జితేంద్ర ప్రసాదను తెస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.