నాదీ పూచీ..రుణదాతలకు జీ బాస్ సుభాష్ చంద్ర హామీ

నాదీ పూచీ..రుణదాతలకు జీ బాస్ సుభాష్ చంద్ర హామీ

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ సుభాష్ చంద్ర ఈ గండం గట్టెక్కేందుకు నానా తంటాలు పడ్తున్నారు. ఇప్పటికే రుణదాతలతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు కూడా హామీ ఇవ్వక తప్పలేదు. కమిటీ ఆఫ్ లెండర్స్ (సీఓఎల్) అంతా కలిసి ఒత్తిడి చేసి సుభాష్ చంద్ర వ్యక్తిగత పూచీకత్తు తీసుకున్నారు. వేరే దారిలేక ఆయన కూడా అందుకు అంగీకరించారు.

సుభాష్ చంద్ర సీఓఎల్ లో ఓ అధికారిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది సీఓఎల్ కు ఎక్కువ అధికారాలు, నియంత్రణ, అజమాయిషీ కట్టబెడుతుంది. ఒప్పందం ప్రకారం వాళ్లు మార్కెట్లో జీ స్టాక్ ధర పడిపోయినా తమ తాకట్టులో ఉన్న షేర్లను అమ్మకూడదు. అలా చేస్తే ఇద్దరం నష్టపోతాం కనుక 90 రోజులు ఓర్పు వహించాలని ఆయన కోరారు. సుభాష్ చంద్ర చెప్పేది నిజమే కావడంతో ఆయా సంస్థలు కూడా అందుకు అంగీకరించాయి. ఇప్పుడు జీ గ్రూప్ పై రూ.13,500 కోట్ల రుణభారం ఉంది. ఒప్పందం ప్రకారం జీ జూలై 31లోగా అమ్మకానికి సంబంధించిన ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవాలి. సెప్టెంబర్ 30లోపు ఈ లావాదేవీలు ముగియాలి. ఈ సమయంలో జీ ప్రతి వారం రుణదాతలతో కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా సమావేశాలు, నెలకోసారి వ్యక్తిగత సమావేశాలు నిర్వహించి ప్రక్రియ తీరుతెన్నులు వివరించాలి. 

హామీలేంటి?  
రుణదాతలతో కుదిరిన ఒప్పందం ప్రకారం సంస్థ వాటాల అమ్మకం పూర్తి కాగానే మొదటి ప్రాధాన్యతగా అప్పులు తీర్చాలి. అధిక కవర్ కల్పించాలి. సంస్థలతో సంబంధం లేకుండా వ్యక్తిగత హామీనివ్వాల్సి ఉంటుంది. ఈ అమ్మకం వ్యవహారం కోసం జీ ఒక ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేయాలి. దీనిని రుణదాతలు కూడా పరిశీలించే వీలుంటుంది. అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని సరిగ్గా వినియోగిస్తున్నారా లేదా అనే విషయంపై కన్నేసి ఉంచుతారు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి  అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా (యాంఫీ) పరిస్థితిని వివరించింది. ఎందుకంటే జీకి ఎక్కువగా అప్పులు ఇచ్చింది ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్, హెచ్ డిఎఫ్ సి ఎంఎఫ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ లే. తమ దగ్గర పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల సొమ్మును కాపాడేందుకు ఇదే ఏకైక మార్గం కావడంతో సుభాష్ చంద్రతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మ్యూచువల్ ఫండ్ సంస్థలు వివరణ ఇచ్చాయి. 

మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో టెన్షన్: 
ఇప్పుడు జీ గ్రూప్ సంస్థ స్టాక్స్‌ను తాకట్టు కింద పెట్టుకున్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఆదిత్యబిర్లా క్యాపిటల్, హెచ్ డి ఎఫ్ సి మ్యూచువల్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ సంస్థలు ఉన్నాయి. ఇలా వివిధ సంస్థల దగ్గర తాకట్టులో సుమారు రూ.11,645 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. ఈ సంస్థలు ఒక్కసారిగా ఏవైనా స్టాక్స్ అమ్మడం మొదలుపెడితే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోతుంది. వేల్యుయేషన్ కూడా తగ్గిపోతుంది. అందుకే అప్పులు ఇచ్చినా కాళ్లావేళ్లా పడి స్టాక్స్ అమ్మకుండా ఆపుతున్నారు.