ఫుణె నుంచి మాధురీ దీక్షిత్‌ పోటీ?

ఫుణె నుంచి మాధురీ దీక్షిత్‌ పోటీ?

ధక్ ధక్ గర్ల్ గా పేరొందిన బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ నెనెని బీజేపీ వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో పూణె స్థానం నుంచి పోటీలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ‘సంపర్క్ ఫర్ సమర్థన్‘ లో భాగంగా మాధురిని ముంబైలోని ఆమె నివాసంలో కలుసుకున్నారు. ఆమెకు నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాలు, విజయాలను వివరించారు. 

పూణె లోక్ సభ స్థానానికి మాధురి దీక్షిత్ పేరును షార్ట్ లిస్ట్ చేసినట్టు గురువారం బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ‘మాధురి దీక్షిత్ ను 2019 లోక్ సభ ఎన్నికల్లో పూణె నుంచి పోటీ చేసే విషయాన్ని పార్టీ పరిశీలిస్తోంది. ఆమెకు ఈ సీటు బాగుంటుందని భావిస్తున్నట్టు‘ తెలిపారు. ‘పార్టీ చాలా లోక్ సభ సీట్ల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను నిర్ణయించే పనిలో ుంది. మాధురి పేరు పూణె నుంచి షార్ట్ లిస్ట్ అయింది. ఆమె ఈ విషయాన్ని పరిశీలిస్తోందని‘ ఆయన అన్నారు. 

51 ఏళ్ల మాధురి దీక్షిత్ హమ్ ఆప్కే హై కౌన్, దిల్ తో పాగల్ హై, సాజన్, దేవదాస్ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పూణె సీటుని కాంగ్రెస్ నుంచి కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి అనిల్ షిరోలే మూడు లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. మాధురిని ఎన్నికల్లో దించడం గురించి మాట్లాడుతూ బీజేపీకి చెందిన మరో నేత ‘నరేంద్ర మోడీ మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయినపుడు కూడా ఇటువంటి ప్రయోగాలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులందరినీ మార్చేశారు. దీంతో పార్టీ బాగా లాభపడిందని‘ చెప్పారు. ‘కొత్త మొహాలను విమర్శించడం తేలిక కాదు. ప్రతిపక్షాలకు విమర్శించే వీలు చిక్కదు. దీంతో పార్టీ ఎక్కువ సీట్లు గెలిచి అధికారం నిలబెట్టుకోవడం సులువవుతుందని‘ తెలిపారు. 2017లో ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీ ఈ ప్రయోగం విజయవంతమైందని గుర్తు చేశారు.