ఇన్వెస్టర్లకు మళ్ళీ పీడకల... 759 పాయింట్లు డౌన్‌

ఇన్వెస్టర్లకు మళ్ళీ పీడకల... 759 పాయింట్లు డౌన్‌

హమ్మయ్య మార్కెట్‌ కుదురుకుంటోంది అని అనుకొని  24 గంటలు కూడా కాకుండానే షాక్‌ ఇచ్చింది మార్కెట్‌. ఇన్వెస్టర్ల కోలుకునేందుకు ఏమాత్రం ఛాన్స్‌ ఇవ్వకుండా ఓపెనింగ్‌లోనే 900 పాయింట్ల దాకా క్షీణించిన మార్కెట్‌ తరవాత ఏమాత్రం కోలుకునేలా కన్పించలేదు. ఆసియాకు కొనసాగింపుగా యూరప్‌ మార్కెట్లు కూడా భారీగా క్షీణించడంతో ఇన్వెస్టర్లు అయినకాటికి అమ్ముకుని బయటపడ్డారు. దీంతో నిఫ్టి 225 పాయింట్లు, సెన్సెక్స్‌ 759 పాయింట్లు క్షీణించాయి. ప్రతి ఒక షేరుకు 25షేర్లు నష్టపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డాలర్‌, చమురు కూడా క్షీణించడంతో చమురు కంపెనీలకు కలిసొచ్చింది. హెచ్‌పీసీఎల్‌ ఏకంగా 16 శాతం పెరగ్గా, ఐఓసీ 6 శాతం, బీపీసీఎల్‌ 5 శాతం వరకు లాభపడ్డాయి. గెయిల్‌ కూడా 4 శాతం లాభంతో ముగిసింది. ఎస్‌ బ్యాంక్‌ 3 శాతం పెరిగింది. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఇండియాబుల్స్ హౌసింగ్‌ 9 శాతం నష్టంతో టాప్‌లో నిలిచింది. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఎస్‌బీఐ ఆరు శాతంపైగా క్షీణించగా, టాటా స్టీల్‌ 5 శాతం, హిందాల్కో నాలుగున్నర శాతంపైగా నష్టపోయాయి.