భారీ లాభాల్లో నిఫ్టి

భారీ లాభాల్లో నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లలో సానుకూల‌త కొన‌సాగుతోంది. రాత్రి యూరో, అమెరికా మార్కెట్లు ఆక‌ర్షణీయ లాభాల‌తో ముగిశాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు ఒక మోస్తరు లాభాల‌తో కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లలో కూడా అప్ ట్రెండ్ కొన‌సాగుతోంది. రేపు ఆర్‌బీఐ ప‌ర‌ప‌తి విధానం ప్రక‌టించ‌నుండ‌టం, వ‌డ్డీ రేట్లు త‌గ్గుతాయ‌న్న ఆశాభావంతో మార్కెట్ ఉంది. ఇవాళ మార్కెట్ మాత్రం ఐటీ, మీడియా షేర్ల కార‌ణంగా భారీ లాభాలు గ‌డించింది.  నిన్న నాలుగు శాతం ప‌డిన జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఇవాళ ఆరు శాతం లాభంతో ట్రేడ‌వుతోంది. నిన్న స్తబ్దుగా ఉన్న ఐటీ షేర్లు ఇవాళ ఆక‌ర్షణీయ లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఆరు శాతం లాభంతో ట్రేడ‌వుతుండ‌గా, టెక్ మ‌హీంద్రా, గ్రాసిం, హెచ్‌పీసీఎల్‌, ఎన్‌టీపీసీ టాప్ గెయిన‌ర్స్‌లో ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న  నిఫ్టి షేర్లలో భార‌తీ ఎయిర్‌టెల్ ఇవాళ కూడా రెండు శాతం దాకా న‌ష్టపోయింది. త‌ర‌వాతి స్థానాల్లో అదానీ పోర్ట్స్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, వేదాంత‌, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉన్నాయి. ఆర్ కామ్‌, ఆర్ ప‌వ‌ర్ స్వల్ప న‌ష్టాల‌తో ట్రేడ‌వుతుండ‌గా, రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ ఇవాళ ఏకంగా 8 శాతం న‌ష్టపోగా రిల‌య‌న్స్ ఇన్‌ఫ్రా 15 శాతం న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి.