నిలకడగా మొదలైన మార్కెట్లు

నిలకడగా మొదలైన మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లు  స్తబ్దుగా ట్రేడవుతున్న సమయంలో మన మార్కెట్ స్వల్ప లాభంతో ప్రారంభమైంది. రాత్రి అమెరికా మార్కెట్లలో నాస్‌డాక్‌ ఒక్కటే అర శాతం లాభం పొందింది. మిగిలిన సూచీల్లో పెద్ద మార్పుల్లేవ్‌. అలాగే యూరో మార్కెట్లు కూడా ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి.  ఇవాళ రాత్రికి ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీలపై తన నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా షేర్లు నష్టాల్లో ఉండగా, జపాన్‌ నిక్కీ, తైవాన్‌ మాత్రం లాభాల్లో ఉన్నాయి. ఫెడ్‌ నిర్ణయం నేపథ్యంలో మన మార్కెట్లలో కూడా ఇవాళ పెద్ద కదలికలు అనుమానమేనని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. నిఫ్టి ఓపెనింగ్‌లో 33 పాయింట్లు లాభపడి 10876 వద్ద ట్రేడవుతోంది. ఐటీ, ఫార్మా షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. సన్‌ ఫార్మా ఇవాళ మరో రెండున్నర శాతం లాభపడింది. లుపిన్‌, టీసీఎస్‌లు  రెండు శాతం దాకా లాభపడ్డాయి. సిప్లా, ఇన్ఫోసిస్‌ లాభాలు ఒక శాతం వరకు పరిమితమయ్యాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ 1.6 శాతం నష్ఠంతో టాప్‌ లూజర్‌గా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఇలో రెడింగ్టన్‌ 15 శాతం లాభపడగా, డెల్టా కార్ప్‌ 7శాతం లాభంతో ట్రేడవుతోంది.