జనవరి 1 నుంచి మారుతి కార్ల ధరలు పెరుగుతాయి

జనవరి 1 నుంచి మారుతి కార్ల ధరలు పెరుగుతాయి

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ వచ్చే ఏడాది జనవరి నుంచి తన వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి ఖర్చుల్లో పెరుగుదల, విదేశీ మారక ద్రవ్య ప్రతికూల ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్న మారుతి సుజుకి వచ్చే నెల నుంచి తన వాహనాల ధరలను పెంచుతోంది. ఈ మేరకు బుధవారం కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. వాహనాల ధరలు ఏ మేరకు పెరుగుతాయో సంస్థ చెప్పలేదు. కార్ల తయారీకి ఉపయోగించే స్పేర్ పార్టుల ధరలు పెరగడం, ఫారిన్ ఎక్స్చేంజి రేట్లు పెరగడంతో కార్ల ధరలపై భారీ ప్రభావం చూపాయని మారుతి సుజుకి ఇండియా షేర్ బజార్ కి చెప్పింది.

గత నెల టొయోటా కూడా రూపాయి విలువ పడిపోవడంతో పెరిగిన ఉత్పత్తి ఖర్చుల కారణంగా జనవరి నుంచి తమ వాహనాల ధరలను 4% వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. నిన్న యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా కూడా జనవరి నుంచి తమ వాహనాల ధరలను రూ. లక్ష వరకు పెంచనున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్ పుట్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చుల కారణంగా ధరలను పెంచక తప్పడం లేదని తెలిపింది. టాటా మోటార్స్ కూడా త్వరలోనే ధరలు పెంచనున్నట్టు సూచనప్రాయంగా తెలియజేసింది. ప్రస్తుతం ఏ మేరకు ధరలు పెంచాలో నిర్ణయించే ప్రక్రియ చేపట్టినట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మాయాంక్ పారిఖ్ తెలిపారు.