మీడియా దిగ్గజంపై ఐటీ దాడులు

మీడియా దిగ్గజంపై ఐటీ దాడులు

మీడియా దిగ్గజం, ది క్వింట్ న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు రాఘవ్ బెహల్ కి ఆదాయ పన్ను శాఖ భారీ షాక్‌ ఇచ్చింది. ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో ఉన్న ఆయన నివాసం, కార్యాలయాలపై ఐటీ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత కేసులో ఈ దాడులు జరిపారు. కీలకమైన డాక్యుమెంట్లు, ఆధారాల కోసం అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో  కూడా సోదాలు కొనసాగుతున్నాయని ఐటీ శాఖ  వెల్లడించింది.

ఐటీ దాడులపై రాఘవ్ ఎడిటర్స్ గిల్డ్‌కు ఫిర్యాదు చేశారు. తాను ముంబైలో ఉండగా డజన్ల కొద్దీ ఐటీ అధికారులు ఢిల్లీలోని తన ఇంటిలో, క్వింట్ కార్యాలయంపై సోదాలు జరపడం ఆందోళన కలిగిస్తోందని రాఘవ్ బెహల్ తెలిపారు. తమ కంపెనీ అన్ని పన్నులు క్రమం తప్పకుండా కడుతోందని, అధికారులకు కావాల్సిన అన్ని పత్రాలు ఇస్తానని తెలిపారు. తన ఈమెయిల్‌ను తెరవొద్దని అధికారులని కోరినట్లు చెప్పారు. ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఇతర సమాచారాన్ని  దుర్వినియోగం చేయొద్దని ఐటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్మార్ట్‌ఫోన్ల ద్వారా సమాచార సేకరణ చేయొద్దని.. అలా చేస్తే ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు. ఎడిటర్స్‌ గిల్డ్‌ అండగా ఉండాలని కోరారు. భవిష్యత్‌లో ఏ ఇతర పాత్రికేయ సంస్థపై జరగబోయే ఈ తరహా దాడులు జరగకుండా చూడాలని బెహల్‌ కోరారు.

క్వింట్‌ పెట్టుబడులు ఉన్న ది న్యూస్ మినిట్  బెంగళూరు కార్యాలయంలో కూడా ఐటీ బృందం సోదాలు చేస్తోంది. ఐటీ చట్టం సెక్షన్ 133ఏ క్రింద  ఇది సర్వే మాత్రమేనని, దాడులు కావని అధికారులు చెప్పారు. ఆర్థిక పత్రాలు, ఆడిట్ పుస్తకాలు చూపించాలని సిబ్బందిని కోరారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్టు ది న్యూస్ మినిట్ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ధన్య రాజేంద్రన్ తెలిపారు.