ఎడారి వలసలు 62% తగ్గాయి

ఎడారి వలసలు 62% తగ్గాయి

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా తగ్గుతోంది. 2017తో పోలిస్తే 30 నవంబర్ 2018 వరకు 11 నెలల్లో ఎడారి దేశాలకు వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్సులు 21% (2.95 లక్షలు) తక్కువయ్యాయి. గత ఐదేళ్లలో అత్యధికంగా 7.76 లక్షల మంది 2014లో గల్ఫ్ దేశాలకు వెళ్లారు. దీంతో పోలిస్తే 2018లో వలసలు 62% తగ్గాయి. ఈసీఆర్ పాస్ట్ పోర్ట్ కార్మికులకు లభించే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లు నమోదు చేసే ‘ఈ-మైగ్రేట్ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ డేటా’ ఈ వివరాలను తెలిపింది. 

2018లో అత్యధికంగా 1.03 లక్షల మంది అంటే 35% కార్మికులు యుఏఈ వెళ్లారు. ఆ తర్వాత 65,000 మంది సౌదీ అరేబియా, 52,000 మంది కువైట్ చేరారు. ఎక్కువ మంది భారతీయులు 2017లోనే అంతకు ముందు మాదిరిగా సౌదీ అరేబియాకి వెళ్లడాన్ని బాగా తగ్గించారు. సౌదీ అరేబియా తెచ్చిన నితాకత్ పథకంతో భారతీయులతో పాటు ఇతర విదేశీ కార్మికులకు కష్టాలు తెచ్చి పెట్టింది. కొత్త పథకం ప్రకారం సౌదీ అరేబియాకి చెందిన కొన్ని కంపెనీలు మాత్రమే విదేశీ ఉద్యోగులను తీసుకొనేందుకు కొత్త బ్లాక్ వీసాకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 

గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య బాగా తగ్గడానికి అనేక కారణాలు ఉన్నట్టు డిసెంబర్ లో విదేశాంగ శాఖ లోక్ సభకు సమాధానమిస్తూ చెప్పింది. ‘ముడిచమురు ధరలు బాగా పడిపోవడంతో గల్ఫ్ దేశాలు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నాయని, పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లో ఎక్కువగా తమ పౌరులకే ఉద్యోగాలిస్తున్నాయని’ తెలిపింది.