కేంద్రమంత్రి మేనకా గాంధీ పై కోర్టుకు వెళ్తా..

 కేంద్రమంత్రి మేనకా గాంధీ పై కోర్టుకు వెళ్తా..

షార్ప్ షూటర్ షఫాత్ అలీఖాన్ పై కేంద్రమంత్రి మేనకాగాంధీ ట్వీట్టర్ వేదికగా పలు విమర్శలు చేసింది. షఫాత్ అలీఖాన్ మహారాష్ట్రలో 3 పులులను, దాదాపు 10 చిరుతలను, కొన్ని ఎనుగులను, 300 అడవి పందులను చంపాడు. జాతి వ్యతిరేకులకు తుపాకులను సరఫరా చేసిన కేసులో, హైదరాబాద్ లో అనుమానాస్పద హత్యకేసులో అతడు నేరగాడు అని ట్వీట్ చేశారు. దీనిపై షఫాత్ అలీఖాన్ స్పందిస్తూ..తనను క్రిమినల్ గా సంబోధిస్తూ ట్వీట్ చేసిన కేంద్రమంత్రి మేనకాగాంధీపై కోర్టులో కేసు వేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అవనిని చంపేందుకు మహారాష్ట్ర అటవీశాఖ అనుమతి పత్రం జారీ చేసిందని.. దానికి మత్తు ఇచ్చి పట్టుకోవాలన్నదే తమ ఆలోచన అని అన్నారు. కానీ తన కుమారుడి బృందంపై పులి అకస్మాత్తుగా దూకడంతో ఆత్మరక్షణ కోసం దాన్ని కాల్చి చంపాల్సి వచ్చిందని వివరించారు. మేనకాగాంధీ తనపైనా, తన కుటుంబంపైనా తీవ్రమైన ఆధారరహిత ఆరోపణలు చేశారని.. నిజానిజాలను దృవీకరించుకోకుండా కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం తమను తీవ్ర షాక్ కు గురిచేసిందని అన్నారు. దీనిపై న్యాయనిపుణుల సలహా తీసుకుని.. రెండు రోజుల్లో తన నిర్ణయం తెలుపుతానని అన్నారు.